New Ration Cards: ఏపీ ప్రజలకు కీలక అప్డేట్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

New Ration card Issue in Andhra Pradesh: ఏపీ ప్రజలకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకు తీపికబురు అందింది. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాను కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 30 వరకు ఈ కేవైసీ చేసుకునేందుకు లబ్దిదారులకు గడువు విధించారు. ఈ నేపథ్యంలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులకోసం 3.36 లక్షల దరఖాస్తులు వచ్చాయని అవి పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అయితే గత ప్రభుత్వ పాలనలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం పాత దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని పేర్కొంది. కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులైన లబ్దిదారులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ నెలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవలే ప్రకటించారు. ఈ క్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్య చేపట్టింది. ఈనెల 15 నుంచి వాట్సప్ లో మనమిత్ర సేవ ద్వారా కొత్త అప్లికేషన్లు స్వీకరించనున్నట్టు ప్రకటించింది. జూన్ లో కొత్త కార్డులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.