Last Updated:

CM Chandrababu : రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu : రాజధాని అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu : పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొని మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.

 

త్యాగాలు తెలిసేలా..
మొన్న ఆత్మార్పణ దినోత్సవాన్ని పెద్దఎత్తున జరుపుకున్నామని సీఎం గుర్తుచేశారు. కర్నూలుతో ప్రారంభమైన తెలుగు రాష్ట్రం పెద్ద మనుషుల ఒప్పందంతో కలిశారని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్‌ను రాజధానిగా మార్చారన్నారు. 11 ఏండ్ల కింద జూన్ 2న మళ్లీ ఏపీ విభజన జరిగిందని గుర్తుచేశారు. ఏపీ ఏర్పాటుకు చాలా తేదీలు వచ్చినా డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసిన రోజు అన్నారు. అందుకే ఆ రోజునే పొట్టి శ్రీరాములను స్మరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి తరానికి తెలిసేలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జనం, తెలుగు జాతి కోసం బతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని సీఎం ఉద్ఘాటించారు.

 

 

నెల్లూరు జిల్లాకు ఆయన పేరు..
నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు కూడా తామే పెట్టామన్నారు. ఆయన త్యాగానికి స్ఫూర్తిగా రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది లోగా పార్కు నిర్మాణం చేసి ప్రారంభిస్తామని చెప్పారు. ఎంతోమంది పుట్టినా కొందరే చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. తెలుగువారి చరిత్ర ఉన్నంతవరకూ పొట్టి శ్రీరాములు గుర్తు ఉంటారని, ఆయన కృషి వల్లే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిందన్నారు. తెలుగు భాష మాట్లాడేవారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్నారని గుర్తుచేశారు. పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను ఈ ఏడాది మొత్తం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ఏడాదిపాటు చేసిన తర్వాత వచ్చే మార్చికి ముగింపు సభ పెడతామని చంద్రబాబు వెల్లడించారు.

 

కఠోర దీక్ష..
ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజులపాటు దీక్ష చేసి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచేవరకూ అప్పుడు ఉన్న తెలుగు ప్రజలు పెద్ద ఆందోళన చేయలేదన్నారు. ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఆగ్రహం పెలుబికిందన్నారు. వారి ఉద్యమాన్ని చూసి నెహ్రూ భయపడి పార్లమెంట్‌లో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించారని గుర్తుచేశారు. 1953 మార్చిలో ఆంధ్రరాష్ట్రం ఏర్పడగా, అక్టోబర్ 1న స్వయం పాలన వచ్చిందన్నారు. తెలంగాణలో కలిసిన తర్వాత మళ్లీ రాష్ట్రం విడిపోయిందని, 2047వరకు దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో ఉంచుతామన్నారు. పీ3 స్ఫూర్తితో పేదరికాన్ని నిర్మూలిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

ఇవి కూడా చదవండి: