కొత్త రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

New Ration Cards : ఏపీలో ఈ నెల 7 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ, కార్డుల స్ల్పిట్, కొత్త సభ్యుల చేరిక, చిరునామా మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కార్డుల్లో మార్పుల కోసం 3.28లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు మంచిగా కనిపించేలా ఉంటుందని చెప్పారు. క్యూఆర్ స్కాన్ చేస్తే గడిచిన 6 నెలలుగా తీసుకున్న రేషన్ బియ్యం వివరాలు కనిపిస్తాయని తెలిపారు.
దేశంలో ఎక్కడైన రేషన్ బియ్యం తీసుకునేలా కార్డు వెసులుబాటు కల్పిస్తుందని చెప్పారు. నెలరోజులపాటు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి ప్రజలు తమ వివరాలు తెలుసుకోవాలని సూచించారు. జూన్ నుంచి స్మార్టు కార్డుల జారీ అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 95 శాతం వరకు ఈ-కేవైసీ పూర్తయిందని చెప్పారు. ఈ-కేవైసీ పూర్తయిన వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని మంత్రి నాదెండ్ల హామీనిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.50 కోట్ల మందికి దీపం పథకం ద్వారా లబ్ధి కలిగిందని చెప్పారు. పాఠశాలలకు 25 కేజీ ఫైన్ క్వాలిటీ బియ్యం ఈ ఏడాది నుంచే సరఫరా చేయబోతున్నామని వెల్లడించారు.