Chandrababu : ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే పీ-4 విధానం : సీఎం చంద్రబాబు

Chandrababu : ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రూ.3.22లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ కార్యాలయానికీ వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదేనన్నారు. ఇవాళ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.
20 ఏళ్ల కింద ఐటీ ప్రాధాన్యత గురించి తాను చెప్పానన్నారు. తన మాట విని ఐటీ రంగం వైపు వెళ్లినవారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారని చెప్పారు. అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులూ ఉన్నతంగా ఎదుగుతారని తెలిపారు. అధికంగా డబ్బు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులు అన్నారు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారన్నారు. అలాంటి వారు పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలని కోరారు. జీరో పావర్టీ సాధించగలిగితే తన జన్మ సార్థకం అవుతుందన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే పీ-4 విధానం తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను ముఖ్యమంత్రి ప్రదానం చేశారు.
కీలక దస్త్రంపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది పండుగ సందర్భంగా పేదలకు సాయంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. రూ.38కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి దస్త్రంపై సంతకం చేశారు. దీని ద్వారా 3,456 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం హయాంలో సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.281 కోట్లు విడుదల చేశారు. అంతకుముందు టీటీడీ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేదాశీర్వచనాలిచ్చారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు పాల్గొన్నారు.