Published On:

Mega 157: మెగా అనిల్ సినిమాలో లక్కీ ఛాన్స్ పట్టేసిన ఎమ్మెల్యే ..

Mega 157: మెగా అనిల్ సినిమాలో లక్కీ ఛాన్స్ పట్టేసిన ఎమ్మెల్యే ..

Mega 157: స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జోరు పెంచేశాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్.. తరువాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో ప్రకటించేశాడు. కుర్ర హీరోలతో  కెరీర్ మొదలుపెట్టిన అనిల్.. నెమ్మది నెమ్మదిగా  సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మారుతున్నాడు. ఇక  మెగా 157 ను ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన అనిల్.. త్వరలోనే సెట్స్ మీదకు కూడా తీసుకెళ్లడానికి సిద్ధం అవుతున్నాడు.

 

ఇక ఈ సినిమాలో చిరు సరసన ఏ హీరోయిన్ నటిస్తుంది అనేదానికి ఇంకా సమాధానం దొరకలేదు. మొన్నటివరకు జ్యోతిక నటిస్తుంది అని వార్తలు వినిపించాయి. ఇక చివరగా నయనతార ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

అందాల భామ క్యాథరిన్ థెరిస్సా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా.. సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న హీరోయిన్స్ లో క్యాథరిన్ ఒకరు. చమ్మక్ చల్లో అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. ఇద్దరమ్మాయిలతో సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి మెప్పించింది. ఇక హీరోయిన్స్ ను రిపీట్ చేయని బన్నీ.. మొట్ట మొదటిసారి క్యాథరిన్ ని రెండోసారి రిపీట్ చేశాడు.

 

సరైనోడు సినిమాలో ఎమ్మెల్యేగా అమ్మడి నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నా.. అమ్మడికి మాత్రం  తగినంత గుర్తింపు దక్కలేదు. అంతెందుకు..  బింబిసార సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, ఆ సినిమాలో నటించిన క్యాథరిన్ కు మాత్రం అవకాశాలు దక్కలేదు.

 

ఇక ఎట్టకేలకు అమ్మడి ఎదురుచూపులకు మంచి ఛాన్స్ దొరికింది. మెగా 157 లో క్యాథరిన్ సెకండ్  హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్నీ ప్రకటించనున్నారట. మరి ఈ సినిమాతో అయినా క్యాథరిన్ మంచి హిట్ ను అందుకుంటుందేమో చూడాలి.