Last Updated:

AP Budget: కూటమి సర్కారు తొలి పూర్తిస్థాయి పద్దు .. సూపర్ సిక్స్ పథకాల అమలుకు రంగం

AP Budget: కూటమి సర్కారు తొలి పూర్తిస్థాయి పద్దు .. సూపర్ సిక్స్ పథకాల అమలుకు రంగం

AP Budget 2025 Allocates funds for Super Six Schemes and Development: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రూ.3.24 లక్షల కోట్లతో 2025-26 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ ఈ పద్దును ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా 3 లక్షల కోట్లు దాటిన ఈ పద్దులో.. సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కాగా, ఏపీ శాసన మండలిలో వార్షిక బడ్జెట్‌‌ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశ పెట్టారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

అప్పు పుట్టని రాష్ట్రంగా..ఏపీ
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసం తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం సవాలుగా మారిందని ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేసిందని, ఆ అవకతవకలను సరిచేసేందుకు తమకు చాలా సమయమే పట్టిందన్నారు. గత ప్రభుత్వ అరాచకాలను స్వయంగా నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించిందని, రుణ సామర్థ్యాన్ని గత పాలకులు సున్నాకు తీసుకువచ్చారని మంత్రి ప్రకటించారు.‘అణుబాంబు దాడిలో విధ్వసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది.. ఆర్థిక విధ్వంసం జరిగిన ఏపీని తిరిగి నిలబెట్టలేమా’ అన్న మాజీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో ఖర్చులు తగ్గించుకుంటూ, వనరులు పెంచుకుంటూ ఈ బడ్జెట్‌ను రూపొందించామన్నారు.

ఏపీని నిలబెడతాం..
గత ఎన్నికల్లో కూటమిపై నమ్మకంతో ప్రజలు అధికారమిచ్చారని, ఆ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ, ఏపీ బ్రాండ్‌ను నిలబెడుతోందన్నారు. విభజన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదురైనా 2014-19 మధ్య కాలంలో రాష్ట్రం మునుపెన్నడూ చూడని రెండంకెల వృద్ధిని సాధించగా, 2019లో వచ్చిన వైసీపీ సర్కార్ రాష్ట్రాన్ని తిరోగమనపు బాటను పట్టించి, ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు.

రూ.3.22 లక్షల కోట్ల పద్దు
సామాన్యుల సంతోషమే.. రాజు సంతోషమని కౌటిల్యుడు చెప్పిన మాటలను గుర్తుచేసిన ఆర్థికమంత్రి, ప్రణాళికా బద్ధంగా ఆర్థిక వ్యవహారాలను గాడిలో పెడుతున్నామని గుర్తుచేశారు. ఇప్పటివరకు రూ.23,500 కోట్ల బకాయిలను చెల్లించామని తెలిపారు. అనంతరం ఆర్థికమంత్రి.. రూ.3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో వ్యవసాయానికి రూ.48 వేల కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. దీనిలో అమరావతి నిర్మాణం కోసం రూ.6,000 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.4,220 కోట్లుగా అంచనా వేశారు.

2027 నాటికి పోలవరం
గత ప్రభుత్వంలో కొట్టుకుపోయిన వివిధ డ్యాముల అంశాన్ని మంత్రి పయ్యావుల ప్రస్తావించారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. పోలవరం-బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. 200 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించేలా పనులు చేపట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల వెడల్పు చేసే పనులు ప్రారంభమైనట్టు బడ్జెట్‌లో స్పష్టీకరించారు.

అచ్చెన్న.. సాగు పద్దు
కాగా, ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. రూ.48,340 కోట్లు కేటాయింపులను ప్రతిపాదిస్తున్నట్లుగా అందులో తెలిపారు. సాగురంగంలో 15 శాతం వృద్ధి తమ లక్ష్యమని, గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలను తీసుకుంటున్నట్లు తెలిపారు. కూటమి సర్కారు వచ్చాక 7. 78 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేయటమే గాక రూ. 120 కోట్ల విత్తన రాయితీ బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు. ఎరువుల నిర్వహణకు రూ. 40 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ. 61 కోట్లు, యంత్రాల రాయితీకి రూ. 139. 65 కోట్లు, డ్రోన్ల రాయితీలకు రూ.80 కోట్లు, కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాల ఏర్పాటుకు రూ.875 కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాల కోసం రూ.250 కోట్లు, కొత్త కౌలు చట్టం తీసుకురావడానికి చర్యలు తీసుకున్నట్లు మంత్రి అచ్చెన్న ప్రకటించారు.

భారం లేకుండానే రాజధాని నిర్మాణం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం.. ఒక సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అని, ప్రభుత్వం దీనికి గతంలో ప్రతిపాదించిన నిధుల్లో ఒక్క రూపాయి కూడా అదనంగా వెచ్చించటం లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు, హడ్కో రుణాలు ఇచ్చాయని, ఇప్పటికే రూ.48వేల కోట్ల మేర పనులకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మార్చి 10న టెండర్లు తెరిచి పనులు ప్రారంభిస్తామన్నారు. మే నెలలో తల్లికి వందనం, త్వరలో అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు వేస్తామని తెలిపారు. గతంలో మ్యాచింగ్‌ గ్రాంట్‌లు ఇవ్వక కేంద్ర నిధులు ఆగాయని, తాము వచ్చాక దానిని సరిదిద్దామని తెలిపారు. కరకట్టను ఫోర్‌ లేన్‌ రోడ్‌గా మార్చటానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని, నది వెంబడి బలమైన రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలనే యోచన ఉందని నారాయణ వెల్లడించారు.

ప్రగతి శీల పద్దు: పవన్
శుక్రవారం బడ్జెట్ మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఈ పద్దును రూపొందించారని ఆయన ప్రశంసించారు. మూలధన వ్యయాన్ని రూ.40,636 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులుపెరుగుతాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటును తగ్గించేలా పద్దు ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా.. అభివృద్ధికి బాటలు వేసేదిగా ఈ బడ్జెట్ ఉందని అభివర్ణించారు. ఆర్థిక బడ్జెట్‌తో బాటు వ్యవసాయ బడ్జెట్‌ను పక్కాగా రూపొందించిన మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడికి ఆయన అభినందనలు తెలిపారు. ఇక ఈ బడ్జెట్ కోసం శ్రమించిన.. ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ శాఖల అధికారులను పవన్ అభినందనలు చెప్పారు.