Pushpa 2: ‘పుష్ప 2’ థియేటర్‌లో మహిళ మృతి – స్పందించిన అల్లు అర్జున్ టీం
Woman Died in Sandhya Theater: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ థియేటర్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. పుష్ప 2 ప్రీమియర్స్ వేళ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ప్రముఖ థియేటర్‌లో తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై పుష్ప టీం స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది. ఇవాళ డిసెంబర్ 5న పుష్ప 2 గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అయితే బుధవారం డిసెంబర్ 4న పలు చోట్ల మూవీ ప్రీమియర్స్, బెన్‌ఫిట్ షోలు పడ్డాయి. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో కూడా పుష్ప 2 ప్రీమియర్ షో వేశారు. సాధారణం ప్రీమియర్స్ షో అంటే అభిమానులు, ఆడియన్స్ సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది.
అలాంటి థియేటర్ ఆ మూవీ హీరో వస్తున్నాడంటే హడావుడి ఏ రేంజ్‌లో ఉంటుందో తెలిసిందే. అలాగే పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్లో ఫ్యామిలీతో అల్లు అర్జున్ వచ్చాడు. ఇక తమ అభిమాన హీరోని చూసేందుకు జనంగా భారీగా థియేటర్‌కి తరలివచ్చారు. వారందరిని పోలీసులు అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో థియేటర్లో వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ కిందపడిపోయారు.
జనం వారిపై నడవడంతో సదరు మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెను గమనించిన ఓ పోలీసు ఆఫీసర్ వెంటనే సీపీఆర్ చేసి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందతూ రేవతి మృతి చెందింది. ఇదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా రేవతి మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై అల్లు అర్జున్ టీం స్పందించింది.
బుధవారం రాత్రి ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందడం దురదృష్టకరమని, ఆ కుటుంబాన్ని త్వరలోనే కలిసి అవసరమైన సాయం అందజేస్తామని ప్రకటించింది. ఇక ఘటనపై మృతురాలి భర్త భాస్కర్ మీడియాతో మాట్లాడారు. “నా కుమారుడు శ్రీతేజ్ అల్లు అర్జున్‌కి వీరాభిమాని. వాడి కోసమే సినిమాకు వచ్చాం. ఆనందంగా సినిమా చూద్దామని వచ్చిన మేము నా భార్యను కొల్పోవడం తట్టుకోలేకపోతున్నా. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు. అప్పటికి అభిమానులు మాములుగా ఉన్నారు. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.