Bhagyashri Borse: రెట్రో లుక్ లో కుమారి.. కాంతపై హైప్ పెంచేసిందిగా

Bhagyashri Borse: ఒక సినిమా హిట్ అయ్యిందా.. ? ప్లాప్ అయ్యిందా.. ? అనేది ముఖ్యం కాదు. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారా.. ? లేదా.. ? అనేది మ్యాటర్. ఒక్కో హీరోయిన్ కు మొదటి సినిమా హిట్ అయినా అవకాశాలు రావు. ఇంకొక హీరోయిన్ కు మొదటి సినిమా ప్లాప్ అయినా.. అమ్మడిని ఇండస్ట్రీ వదలదు. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే రెండో కేటగిరికి చెందుతుంది అని చెప్పొచ్చు. మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ తెలుగుతెరకు పరిచయమైంది. అమ్మడి అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
సినిమా రిలీజ్ అవ్వకముందే భాగ్యశ్రీకి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఛాన్స్ లు వచ్చాకా.. సినిమా హిట్ అయితే ఎంత.. ప్లాప్ అయితే ఎంత. మిస్టర్ బచ్చన్ ప్లాప్ భాగ్యశ్రీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయలేకపోయింది. కింగ్డమ్ నుంచి శ్రీలీల ఏ ముహూర్తాన తప్పుకుందో కానీ, వెంటనే ఆ ఛాన్స్ ను భాగ్యశ్రీ లాగేసుకుంది. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన కింగ్డమ్ సాంగ్ లో విజయ్ దేవరకొండతో గట్టి లిప్ లాక్ ఇచ్చి.. మంచి గుర్తింపునే అందుకుంది.
ఇక ఇది కాకుండా రామ్ పోతినేని సరసన RAPO22 లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు పెద్ద సినిమాలే. వీటితో అమ్మడు ఆగలేదు.. ఏకంగా తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. కాంత సినిమాతో తమిళ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నాడు. 1950 కాలంలో జరిగే కథతో కాంత తెరకెక్కుతుంది. ఇప్పటికే దుల్కర్ రెట్రో లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ నటిస్తోంది. నేడు అమ్మడి పుట్టినరోజు కావడంతో .. కొత్త పోస్టర్ ను రిలీజ్ చేస్తూ తమ హీరోయిన్ కి బర్త్ డే విషెస్ చెప్పారు మేకర్స్. కాంతలో కుమారిగా భాగ్యశ్రీ నటిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ లో భాగ్యశ్రీ రెట్రో లుక్ అదిరిపోయింది. నిండుగా చీరకట్టుకొని.. గాజులు, బొట్టు పెట్టుకొని ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాలను అందుకుంటుంది అనేది చూడాలి.