Shehbaz Sharif : దేనికైనా సిద్ధం : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు

Pakistan Prime Minister Shehbaz Sharif : జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై పొరుగుదేశంలోని పలువురు మంత్రులు మండిపడ్డారు. ఈ కీలక పరిణామాలపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తాజాగా మౌనం వీడారు. పహల్గాం దాడిపై తాము దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామని వ్యాఖ్యానించారు.
దర్యాప్తులో పాల్గొనేందుకు సిద్ధం..
శనివారం పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోందని చెప్పారు. ఘటనపై దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకే తమ ప్రాధాన్యమని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము తీవ్రంగా ఖండిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.
దేశ భద్రతపై రాజీపడబోం..
ఉగ్రవాదాన్ని సమూలంగా అంతం చేస్తామని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు. తమ దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోమని స్పష్టం చేశారు. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావించారు. భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పరోక్షంగా హెచ్చరించారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తాము కోరుకుంటున్నామని ఇండియాను నిందించే ప్రయత్నం చేశారు.
ఈ నెల 22వ తేదీన జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది మృతిచెందారు. దీన్ని వెనక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ హస్తం ఉన్నట్లు భద్రతా బలగాలు భావించాయి. ఈ నేపథ్యంలోనే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాక్‌కు భారత్ గట్టి షాక్ ఇచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అందుకు పాక్ కూడా ప్రతిచర్యలు చేపట్టింది. భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.