Published On:

Pope Francis : ఆ రోజే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు : వెల్లడించిన వాటికన్ వర్గాలు

Pope Francis : ఆ రోజే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు : వెల్లడించిన వాటికన్ వర్గాలు

Pope Francis : క్యాథ‌లిక్ క్రైస్త‌వ మ‌ఠాధిప‌తి పోప్ ఫ్రాన్సిస్ సోమ‌వారం క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. పోప్‌ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్‌ సిటీ ప్రకటించింది. ప్రక్రియ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నేడు కీలక కార్డినళ్ల సమావేశం జరిగింది. ఇటలీ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మొదలైంది. రోమ్‌లో అందుబాటులో ఉన్న కార్డినళ్లు సమావేశానికి ఆహ్వానించారు.

 

కార్యక్రమంలో పోప్‌ భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్‌ పీటర్స్‌ బసిలికాకు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచాలని నిర్ణయించారు. తొమ్మిది రోజులపాటు సంతాపదినాలు పాటిస్తున్నారు. సాధారణంగా పోప్‌ అంత్యక్రియలు, ఖననం ప్రక్రియ మృతిచెందిన నాటినుంచి నాలుగు నుంచి ఆరో రోజు మధ్యలో పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే శనివారం అంత్యక్రియల నిర్వహించాలని నిర్ణయించారు. పోప్‌ భౌతికకాయం ఫొటోలను తొలిసారి వాటికన్‌ విడుదల చేసింది.

 

పోప్‌ మరణంపై స్పందించని చైనా..
పోప్‌ ఫ్రాన్సిస్‌ మరణంపై ప్రపంచ దేశాలు, అధినేతలు స్పందించారు. మరోవైపు బీజింగ్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. వాటికన్‌-చైనా కొన్నేళ్లుగా సరైన సంబంధాలు లేకపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. చైనాలో బిషప్‌లను ఎవరు నియమించాలనే అంశంపై వివాదంతో 1951లో బీజింగ్‌ దౌత్య సంబంధాలను తెగదెంపులు చేసుకొంది. బీజింగ్‌లోని కేథలిక్‌ చర్చిల్లో బిషప్‌ల నియామకాలు తమ కనుసన్నల్లో పూర్తి చేయాలని పట్టుబడుతోంది. 2018లో బిషప్‌ల నియామకంలో ప్రభుత్వం పాత్ర విషయమై ఓ ఒప్పందం జరిగింది. దీనిని గత నవంబర్‌లో పొడిగించారు. నేషనల్‌ సెక్యూరిటీ చట్టాన్ని 2022లో హాంకాంగ్‌పై రుద్దిన వేళ.. కార్డినల్‌ జోసఫ్‌ జెన్‌ అరెస్టు మరోసారి వివాదానికి కారణమైంది.

 

అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
పోప్‌ అంతిమ సంస్కారాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హాజరుకానున్నారు. విషయాన్ని ఆయన సోషల్‌ మీడియాలో వెల్లడించారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా కూడా వెళ్లనున్నారు. శ్వేత సౌధంలో సంప్రదాయ ఈస్టర్‌ ఎగ్‌ రోల్‌ వేడుక ముగియగానే పోప్‌ మృతి వార్తను అధ్యక్షుడికి చేరవేశారు.

 

భారతీయులు ఓటింగ్‌..
పోప్‌ తర్వాత ఆ స్థానంలోకి వచ్చే కొత్త వారిని ఎన్నుకోవడంలో భారత్‌ కీలక పాత్ర పోషించనుంది. 135 మంది కార్డినళ్లు కలిసి నూతన పోప్‌ను ఎన్నుకోనున్నారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. తొలుత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినళ్లు పోప్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఆ తర్వాత సిస్టీన్‌ ఛాపెల్‌లో పాపల్‌ కాంక్లేవ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికలో భారత్‌ తరఫున కార్డినళ్లు ఫిలిప్‌ నెరి ఫెర్రావ్‌, క్లీమిస్‌ బసెలియోస్‌, ఆంథోనీ పూల, జార్జ్‌ జాకబ్‌ కూవకాడ్‌ పాల్గొనున్నారు.

 

 

ఇవి కూడా చదవండి: