India Pakistan Ceasefire: భారత్-పాక్ కాల్పుల విరమణ.. జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ పరిస్థితులు!

India Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాక్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా కూల్చివేసింది.
సాధారణంగా మారిన పరిస్థితులు..
ఆదివారం ఉదయం నుంచి జమ్మూకశ్మీర్, శ్రీనగర్ అఖ్నూర్, రాజౌరి, పూంచ్‌లో పరిస్థితులు సాధారణంగా మారాయి. వేకువజాము నుంచి డ్రోన్లు, మిస్సైల్స్ కనిపించలేదు. పూంచ్ సెక్టార్, రాజౌరి సెక్టార్లలో ప్రస్తుతం ప్రశాంతంగా కనిపిస్తున్నది. పంజాబ్‌లోని అమృత్ సర్‌లో రెడ్ అలెర్ట్‌ను అధికారులు ఎత్తివేశారు. ఈ క్రమంలో స్వర్ణ దేవాలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పంజాబ్‌లోని ఆయా ప్రాంతాల్లో ఇవాళ ఉదయం పరిస్థితి సాధారణంగా కనిపించింది.
జమ్మూకశ్మీర్ పరిపాలన అడ్వైజరీ జారీ..
జమ్మూకశ్మీర్ పరిపాలన అడ్వైజరీ జారీ చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మొద్దని సూచించింది. ఇటీవల జరిగిన పరిణామాల సందర్భంగా ప్రశాంతంగా ఉన్న పౌరులను సర్కారు అభినందించింది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ సమాచారం వ్యాప్తి చెందుతున్న సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రక్షణ సంబంధిత విషయాలపై సమాచారం కోసం అధికారిక వాట్సాప్ చానెల్‌లో సంప్రదించాలని రక్షణ మంత్రిత్వ శాఖ సూచించింది.
జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుద చేసింది. సాధారణ పౌరులు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, ఇతర ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన అన్ని ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించాలని కోరింది. సోషల్ మీడియాలో ఫేక్ సమాచారం అనవసరమైన భయాందోళనలకు కారణమవుతుందని ప్రభుత్వం పేర్కొంది. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు నిర్వహించడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.