Published On:

India Pakistan War: పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ.. 1971లో ఇందిరాగాంధీ నిర్ణయంపై జోరుగా చర్చ!

India Pakistan War: పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ.. 1971లో ఇందిరాగాంధీ నిర్ణయంపై జోరుగా చర్చ!

EX PM Indira Gandhi Era during India Pakistan War: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మరికొందరు నేతలు ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు.

 

ఇండియా-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్‌ స్పందించారు. తనకు చాలా సంతోషంగా ఉందని, భారత్ ఎప్పుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదని చెప్పారు. కానీ, ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకుందని పేర్కొన్నారు. గుణపాఠం చెప్పారని తాను నమ్ముతున్నానని తెలిపారు. మాట తప్పడం పాక్ నైజమని ఆరోపించారు. పాక్ వాగ్దానాలను ఎలా నమ్ముతాం? అని కామెంట్స్‌ చేశారు.

 

1971లో జరిగిన యుద్ధంపై కూడా ఆయన స్పందించారు. 1971లో ఒక గొప్ప విజయం అందుకున్నామని కొనియాడారు. ఇందిరాగాంధీ ఉపఖండం మ్యాప్‌ను తిరగ రాశారని గుర్తుచేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ నైతిక లక్ష్యంతో పోరాడుతోందని, పాక్‌పై దాడులు చేయడం, బాంబులు పేల్చడం స్పష్టమైన లక్ష్యం కాదని కామెంట్స్‌ చేశారు.

 

ఇందిర, మోదీ వైఖరితో పోల్చుతూ ప్రచారం..

పాక్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన సందర్భంగా ఇందిరాగాంధీ ప్రధానిగా తీసుకున్న చర్యను ప్రధాని మోదీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా ప్రచారం జరుగుతోంది. దీనిపై పలు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

 

అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్..

మరోవైపు పాక్‌తో కాల్పులు విరమణ ఒ‍ప్పందంపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాల్పుల విరమణ అంశంపై వెంటనే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పార్లమెంటు ప్రత్యేక సెషన్‌ నిర్వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. వాషింగ్టన్‌ నుంచి కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన వెంటనే అఖిలపక్ష సమావేశం జరగాలని కోరారు. పార్లమెంటు ప్రత్యేక భేటీని ఏర్పాటుచేసి కొన్ని రోజులుగా జరుగుతున్న అంశాలను చర్చించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

పవన్‌ ఖేడా స్పందిస్తూ..

కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా స్పందించారు. 5,6 రోజుల్లో దేశం ఏం సాధించిందో.. ఏం కోల్పోయిందో ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1971 యుద్ధం సందర్భంగా సైనికులతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దిగిన ఫొటోలను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. ఇందిర లేని లోటు కనిపిస్తోందని పేర్కొంది. ఇందిర ధైర్యం చూపారని, దేశం కోసం నిలబడ్డారని గుర్తుచేశారు. జాతి పౌరుషంతో ఆమె రాజీ పడలేదని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది.

ఇవి కూడా చదవండి: