Published On:

India-Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందూ లీడర్ హత్య.. తీవ్రంగా స్పందించిన భారత్‌

India-Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందూ లీడర్ హత్య.. తీవ్రంగా స్పందించిన భారత్‌

India-Bangladesh : బంగ్లాలో మైనార్టీలపై జరుగుతోన్న దాడులపై తాజాగా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో దినాజ్‌పుర్‌లో భబేశ్‌ చంద్ర మృతి ఘటన సందర్భంగా భారత విదేశాంగశాఖ స్పందన వచ్చింది.

 

హిందూ మైనార్టీలపై దాడులు..
బంగ్లాలో హిందూ మైనార్టీ నేత భబేశ్‌ చంద్ర రాయ్‌ కిడ్నాప్, దారుణ హత్య గురించి తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటన ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ పాలనలో హిందూ మైనార్టీలపై జరుగుతోన్న దాడుల్లో ఇది ఇంకో ఘటన అన్నారు. గతంలో ఈ తరహానే దాడులకు పాల్పడిన నిందితులు ఎలాంటి శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి సాకులు, వివక్ష లేకుండా మైనార్టీలను రక్షించే బాధ్యత తాత్కాలిక సర్కారు నిర్వహించాలని మరోసారి గుర్తుచేస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

 

నలుగురు వ్యక్తుల ప్రమేయం..
ఉత్తర బంగ్లాలోని దినాజ్‌పుర్‌కు చెందిన భబేశ్‌ చంద్రరాయ్‌ (58)కు గురువారం సాయంత్రం ఫోన్‌ వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. తాను ఇంట్లోనే ఉన్నానని భబేశ్‌ అవతలి వ్యక్తికి చెప్పారని, అరగంట తర్వాత నలుగురు వ్యక్తులు ఇంటికి వచ్చి బలవంతంగా తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే నరబరి గ్రామంలో భబేశ్‌ తీవ్రగాయాలతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించినట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందారు. దుండగులు అతడిని తీవ్రంగా కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

 

షేక్‌హసీనా దేశం విడిచివెళ్లిన తర్వాత..
మాజీ ప్రధాని షేక్‌హసీనా దేశం విడిచివెళ్లిన తర్వాత బంగ్లాలో మైనార్టీలు, హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇండియా స్పందించింది. పొరుగుదేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది. దాడులను నివారించడానికి బంగ్లాదేశ్ తాత్కాలిక సర్కారు మైనార్టీలు, హిందువుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపింది.

 

 

ఇవి కూడా చదవండి: