Puri- Sethupathi: పుష్ప విలన్ ని రంగంలోకి దించుతున్న పూరీ.. ఇదేదో బాగా వర్కవుట్ అయ్యేలా ఉందే..?

Puri- Sethupathi:డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమాతో బిజీగా మారాడు. ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వరుస ప్లాపు లతో ఉన్న పూరీ.. ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాను పూరీ, ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. బెగ్గర్ సినిమా కోసం పూరీ.. స్టార్స్ ను దించుతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో టబు, రాధికా ఆప్టే నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
టాలెంటెడ్ నటీనటులందరినీ పూరీ ఒకచోటకు చేరుస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి విలన్ గా మలయాళ స్టార్ హీరో గా ఫహాద్ ఫాజిల్ ను దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫహాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో విలన్ గా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. పార్టీ లేదా పుష్ప అనే ఒక్క డైలాగ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు.
ఇక పుష్ప 2 లో కూడా తన నటనతో మెప్పించిన ఫహాద్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విజయ్ సేతుపతి లానే ఫహాద్ కూడా. కథ నచ్చితే పాత్ర ఎలాంటిది అనేది చూడడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, గెస్ట్ గా కూడా చేస్తాడు. ఇక బెగ్గర్ సినిమాలో విలన్ గా పూరీ మొదటి నుంచి ఫహాద్ నే అనుకుంటూ వచ్చాడట. ఆయన్ను సంప్రదించి కథ చెప్పడం, ఫహాద్ ఒప్పుకోవడం కూడా జరిగిందని టాక్ నడుస్తోంది. నిజం చెప్పాలంటే ఫహాద్ ఒప్పుకుంటే మాత్రం సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి.
విజయ్ సేతుపతి, ఫహాద్ కలిసి ఇప్పటికే విక్రమ్ సినిమాలో నటించారు. అందులో విజయ్ విలన్ కాగా.. ఫహాద్ హీరోగా కనిపించారు. ఇక ఇప్పుడు ఇందులో విజయ్ హీరో అయితే.. ఫహాద్ విలన్ గా కనిపించబోతున్నాడు. అసలు ఇంతమంది స్టార్స్ ను తన కథతో మెప్పించి ఒప్పించాడంటే పూరీ ఈసారి గట్టిగానే కొడతాడని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో పూరీ బౌన్స్ బ్యాక్ అవుతాడా.. ? ఈ స్టార్స్ అందరూ పూరీనీ కాపాడతారా..? అనేది చూడాలి.