Hit 3 Third Single: వైలెంట్ అర్జున్ సర్కార్ లోని ప్రేమ భావాలు.. అదిరిపోయాయి

Hit 3: న్యాచురల్ స్టార్ నాని – శైలేష్ కొలను కాంబోలో వస్తున్న చిత్రం హిట్ 3. ఈ సినిమాలో శ్రీనిధిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హిట్ సిరీస్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు శైలేష్.. తన హిట్ ప్రాంచైజీలోకి నానిని దింపుతున్నాడు. అర్జున్ సర్కార్ గా నాని నట విశ్వరూపం ఇందులో కనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన నాని .. ఒకపక్క వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ బిజీగా మారాడు. ఇంకోపక్క మేకర్స్ సైతం సినిమాలోని కంటెంట్ ను కొద్దికొద్దిగా రిలీజ్ చేస్తూ ఇంకా హైప్ పెంచుతూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ఈ సాంగ్ ను పాడడం విశేషం. తన కోసమే నా పొగరే మరీ అణిగేనా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఎంతో రఫ్ అండ్ టఫ్ గా ఉండే అర్జున్ సర్కార్.. మృదుల ప్రేమలో పడి తన కోపాన్ని, ఆవేశాన్ని వదిలేసి ఆమె దగ్గరకు వెళ్లడం వీడియోలో చూపించారు. ప్రేయసి దగ్గరకు వెళ్లే ముందు తనేంటి, తన కోసం తాను ఎందుకు మారుతున్నాను అని ఆలోచన చేసుకుంటున్న హీరో మనోభావాలను లిరిక్స్ తెలియజేస్తున్నాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు రాఘవ్ లిరిక్స్ అందించాడు. ఇక అనిరుధ్ వాయిస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నాని – అనిరుధ్ హిట్ కాంబో. నాని నటించిన. గ్యాంగ్ లీడర్ సినిమాకు సంగీతం అందించింది అనిరుధ్ నే. సాంగ్ మొత్తం ఎంతో గమ్మత్తుగా షూట్ చేశారు. క్రిమినల్స్ ను చితకబడుతూ.. తను నా నీడనా.. తన కోసమే మారేనా అంటూ అర్జున్ సర్కార్ పాడడం గమ్మతుగా అనిపించింది. ఇప్పటికే హిట్ 3 నుంచి వచ్చిన రెండు సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా మారుతుందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.