Ajith: బలవంతంగా అయినా సినిమాలను వదిలేస్తా..
Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఈ మధ్యనే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ లో ఫ్యాన్స్ కు నచ్చింది కానీ, తెలుగులో మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అజిత్ సినిమా సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. మధ్యలో తనకు నచ్చిన రేసింగ్ లో పాల్గొంటాడు. బైక్ పైన ప్రపంచం మొత్తం చుట్టి వస్తాడు. ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. సమయాన్ని వృధా చేయడం అజిత్ కు అస్సలు ఇష్టం ఉండదు.
తాజాగా అదే విషయాన్నీ అజిత్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొన్నటికి మొన్న అప్పులు తీర్చడానికే సినిమాల్లోకి వచ్చానని చెప్పిన అజిత్..ఇప్పుడు సినిమాల్లో నుంచి బలవంతంగా అయినా బయటకు వస్తాను అని చెప్పడం అభిమానుల్లో కలవరం రేపుతోంది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడు సినిమాల్లో నుంచి వెళ్ళిపోతానో నాకే తెలియదు. అప్పులు తీర్చడం కోసం సినిమాల్లోకి వచ్చిన నేను.. బలవంతంగా అయినా సినిమాలను వీడొచ్చేమో.
ఇప్పటికీ ప్రేక్షకులు నా నటనను ఆదరిస్తున్నారు. ఈ సమయంలో నేను వైదొలిగితేనే మంచిదేమో. రేపు నటన నచ్చకపోతే వారు నన్ను తిట్టుకుంటారు. ఆ పరిస్థితి తెచ్చుకోవాలని లేదు. జీవితాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు. అది చాలా విలువైనది. నేను చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. నా ఫ్రెండ్స్ లో ఎన్నో పోరాటాలను చేసినవారిని చూసాను.
క్యాన్సర్ తో బాధపడుతూ ఇప్పుడు చికిత్స పొందుతున్నవారు ఉన్నారు. వారిని చూసాకా జీవితం విలువ తెలిసింది. నా లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నా. సమయాన్ని సద్వినియోగించుకోవాలనుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అజిత్ ఇలా అనడానికి కారణం ఏమై ఉంటుందో అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు.