IPL 2025: చెన్నై చిత్తు చిత్తు.. 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

Chennai Super Kings vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ రికార్డు విజయం నెలకొల్పింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇక, ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఈ విజయం వరుసగా రెండోది కాగా, చెన్నైకి తొలి ఓటమి కావడం విశేషం.
తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్(32), విరాట్ కోహ్లీ(31), పడిక్కల్(27), రజిత్ పటీదార్(51), టిమ్ డేవిడ్(22) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. మతీధ పతిరానా రెండు, అశ్విన్,ఖలీల్ చెరో వికెట్ తీశారు.
197 పరుగులు లక్ష్యఛేదనలో చెన్నైకి ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. హేజిల్ వుడ్ తన తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు తీశాడు. రాహుల్(5), రుతురాజ్ గైక్వాడ్(0)లను పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత దీపక్ హుడా(4), సామ్ కరన్(8) తక్కువ స్కోరుకే ఔట్ అయ్యారు. రచిన్(41) రాణించగా.. శివమ్ దూబే(19), రవీంద్ర జడేజా(25), అశ్విన్(11), ధోనీ(30) పరుగులు చేశారు. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో హేజిల్ వుడ్ 3 వికెట్లు తీయగా.. యశ్ దయాల్, లివింగ్ స్టోన్ రెండు వికెట్లు, భువనేశ్వర్ ఒక వికెట్ తీశాడు.
కాగా, చెన్నైపై ఆర్సీబీ విజయం సాధించడంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ స్పెషల్ ట్వీట్ చేసింది.ఐపీఎల్ ప్రారంభంలో 2008లో రాహుల్ కెప్టెన్ ఉన్న సమయంలో చెన్నైలో బెంగళూరు మొదటిసారి గెలుపొందగా.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత చెపాక్ వేదికగా చెన్నైను ఆర్సీబీ ఓడించింది.