Relief for Tamil Nadu DMK Government: 10 బిల్లులపై సుప్రీం కోర్టులో స్టాలిన్ సర్కారుకు ఊరట

Relief for Tamil Nadu DMK Government in Supreme Court: తమిళనాడు డీఎంకే సర్కారుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సర్కారు శాసనసభలో ఆమోదించిన బిల్లులు ఆపొద్దని స్పష్టంచేసింది. కీలక బిల్లులకు సమ్మతి తెలపకుండా పెండింగ్‌లో ఉంచడం చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను ఆమోదించడంలో జాప్యం వల్ల గవర్నర్ ఆర్‌ఎన్ రవికి, తమిళనాడు సర్కారుకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షం..
పది బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయాలన్న గవర్నర్ చర్య చట్టవిరుద్ధం, ఏకపక్షమని పేర్కొంది. గవర్నర్ బిల్లును పునఃపరిశీలనకు వెనక్కి పంపిన తర్వాత అసెంబ్లీ తిరిగి ఆమోదించిన అనంతరం రెండోసారి బిల్లులను రాష్ట్రపతి రిజర్వ్ చేయలేరని తెలిపింది. బిల్లులను గవర్నర్‌కు తిరిగి సమర్పించిన తేదీ నుంచి వీటిని ఆమోదం పొందినట్టుగా పరిగణించాలని పేర్కొంది. మరోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను సర్కారు సమర్పించిన తర్వాత గవర్నర్ ఆమోదించి ఉండాల్సిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
ఆర్టికల్ 200 ప్రకారం..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం శాసనసభ ఒక బిల్లును పాస్ చేసి ఆమోదం కోసం పంపినప్పుడు గవర్నర్ బిల్లుకు ఆమోదముద్ర వేయడం, సమ్మతిని నిలుపుదల చేయడం, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపడం, పునఃపరిశీలనకు మళ్లీ శాసనసభకు పంపడం వంటివి చేస్తారు. తర్వాత మళ్లీ సభ బిల్లును ఆమోదిస్తే, గవర్నర్ సమ్మతితో నిలిపేయలేరు. కానీ, దాన్ని రాష్ట్రపతి పరిశీలనకు రిజర్వ్ చేయవచ్చు. రాజ్యాంగానికి, ప్రభుత్వ విధానాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలకు విరుద్ధంగా ఉందని భావిస్తే, ఆ విధంగా రిజర్వ్ చేసే వీలు ఉంది.
తమిళనాడు ప్రభుత్వం ఆరోపణ..
శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆర్‌ఎన్. రవికి పంపగా, ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తన వద్ద ఉంచేసుకుంటున్నారని తమిళనాడు సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బిల్లులను సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి పంపడం లేదని తెలిపింది. రెండోసారి ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ తీరు మారడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంపై తాజాగా సుప్రీం తీర్పు వెలువరించింది.