Published On:

Gold price : తగ్గిన గోల్డ్ ధర.. ఆల్‌టైమ్‌ గరిష్ఠాల నుంచి 10శాతం క్షీణత

Gold price : తగ్గిన గోల్డ్ ధర.. ఆల్‌టైమ్‌ గరిష్ఠాల నుంచి 10శాతం క్షీణత

Gold price falls : అంతర్జాతీయంగా డిమాండ్‌ తగ్గడంతో దేశీయంగా గోల్డ్ ధర దిగొచ్చింది. భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడమే ఇందుకు కారణం. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర రూ.1800 తగ్గి, రూ.95,050 పన్నులు కలుపుకొని పలుకుతోంది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.94,600 వద్ద కొనసాగుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌‌లో ధర రూ.95,350 వద్ద కొనసాగుతోంది.

 

అదే దారిలో వెండి..
మరోవైపు వెండి ధర తగ్గుముఖం పట్టింది. ఢిల్లీలో కేజీ వెండి రూ.97వేలు పలుకుతోంది. అంతకుముందు ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.98 వేలుగా ఉన్న వెండి ధర రూ.వెయ్యి మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్‌గోల్డ్‌ ఔన్స్ 16 డాలర్లు తగ్గింది. 3160 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి ఔన్స్ 32 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

 

10 శాతం డౌన్‌..
బంగారం ఇప్పటి వరకు ఆల్‌టైమ్‌ గరిష్ఠాల నుంచి భారీగా క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏప్రిల్‌ నెలలో ఔన్స్ 3500 డాలర్ల వరకు వెళ్లింది. తాజాగా బంగారం 10 శాతం క్షీణించి 3150 డాలర్లకు దిగింది. దేశీయంగా లక్ష రూపాయల మార్కు దాటిన పసిడి.. రూ.7-8 వేల వరకు తగ్గింది. భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్నాళ్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించి మదుపర్లు బంగారంలో మదుపు చేయడంతో డిమాండ్‌ ఏర్పడింది.

 

టారిఫ్‌ వార్‌కు దిగిన అమెరికా-చైనా అవగాహనకు వచ్చాయి. భారత్‌- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారడం, పశ్చిమాసియా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సిరియాపై ఆంక్షలు సడలిస్తూ ప్రకటన చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఉద్రిక్తతలు చల్లారిన వేళ రిస్క్‌తో కూడిన పెట్టుబడి సాధనాల వైపు మదుపర్లు మొగ్గుచూపడంతో బంగారం ధర దిగి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: