IPL 2025 : ఐపీఎల్ జట్లకు భారీ ఊరట.. నిర్ణయం మార్చుకున్న సౌతాఫ్రికా

IPL 2025 : ఇండియా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులపాటు బీసీసీఐ వాయిదా వేసింది. ఐపీఎల్ తిరిగి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు దక్షిణాఫ్రికా గుడ్‌న్యూస్ చెప్పి భారీ ఊరట కల్పించింది. మొదట దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌కు ఈ నెల 26వ తేదీ వరకే అందుబాటులో ఉంటారని ప్రకటించింది. జూన్‌లో తాము ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ మొదటి ప్రాధాన్యం ఐపీఎల్ కాదని చెప్పింది. కానీ, ఇంతలోనే యూటర్న్ తీసుకొని తమ నిర్ణయాన్ని మార్చుకుంది.
అందుబాటులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు..
ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా క్రీడాకారులు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా తన సన్నాహక సమయాన్ని తగ్గించుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆ జట్టు జింబాబ్వేతో జూన్ 3వ తేదీన వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ, తాజాగా తీసుకున్న నిర్ణయంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉంది. తమ షెడ్యూల్‌లో ఓ సవరణ చోటుచేసుకుందని, జూన్ 3వ తేదీ నుంచి తాము డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కోసం సన్నాహకాలను ప్రారంభించబోతున్నామని క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనోచ్ న్క్వే మీడియాతో తెలిపారు.
ఆటగాళ్లు వీరే..
కగిసో రబాడ గుజరాత్ టైటాన్స్, లుంగి ఎంగిడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ట్రిస్టన్ స్టబ్స్ ఢిల్లీ క్యాపిటల్స్, ఐదెన్ మార్‌క్రమ్ లక్నో, ర్యాన్ రికెల్టన్, కార్బిన్ బాష్ ముంబయి ఇండియన్స్, మార్కో ఎన్సన్ పంజాబ్ కింగ్స్, వియాన్ ముల్డర్ ఎస్ఆర్‌హెచ్ తమ తమ ఐపీఎల్ జట్లకు మ్యాచ్‌లు పూర్తయ్యేంత వరకు అందుబాటులో ఉండనున్నారు.