Rahul Gandhi : భయంతోనే ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారు.. రాహుల్ గాంధీ

Rahul Gandhi, leader of the opposition in the Lok Sabha : దేశంలో అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభలో పతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి మోదీ భయపడ్డారన్నారు. బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ప్రయత్నించారని చెప్పారు. అన్నీ అడ్డంకులను అధిగమించి వచ్చానని తెలిపారు.
సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం..
ఈ ఏడాది చివరిలో బిహార్‌లో శాసన సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా బిహార్‌లో యువతతో మమేకమయ్యేందుకు తలపెట్టిన ‘శిక్షా న్యాయ్ సంవాద్’ కార్యక్రమాన్ని రాహుల్ ప్రారంభించారు. మిథిలా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు, అధికారులు ఎంతో ప్రయత్నించారని చెప్పారు. యూనివర్సిటీ గేట్ బయట తన కారును నిలిపి వేశారని మండిపడ్డారు. అయినా తాను వెనుకడుగు వేయలేదన్నారు. నడుచుకుంటూ సభా వేదిక పైకి చేరుకున్నానని చెప్పారు. బిహార్ ప్రభుత్వం తనను ఎందుకు ఆపలేకపోయిందో తెలుసన్నారు. మీ అందరి అభిమానమే తనను ముందుకు నడిపించిందన్నారు. ఇదే శక్తి మోదీని గద్దె దించుతుందని అన్నారు. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు కులగణను మోదీ అంగీకరించారని గుర్తుచేశారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు.
అంబానీ, అదానీల కోసం పనిచేస్తోన్న మోదీ..
ఎన్డీయే ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కాకుండా అంబానీ, అదానీల కోసం పనిచేస్తోందని విమర్శించారు. కేవలం 5 శాతం మంది ప్రజల ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు మోదీ ప్రభుత్వంలో స్థానం లేదని చెప్పారు. కార్పొరేట్ వ్యక్తులకే వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరారు. ప్రైవేట్ కళాశాలలు, యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మెడలు వంచి నిధులను విడుదల చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.