Published On:

Supreme Court : హైకోర్టులో క్షమాపణలు చెప్పండి.. మధ్యప్రదేశ్‌ మంత్రిపై సుప్రీం సీరియస్

Supreme Court : హైకోర్టులో క్షమాపణలు చెప్పండి.. మధ్యప్రదేశ్‌ మంత్రిపై సుప్రీం సీరియస్

Supreme Court serious about Minister Vijay Shah : భారత సైనికాధికారిణి కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ గిరిజన సంక్షేమశాఖ మంత్రి విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వ్యాఖ్యలు వివాదం కావడంతో కేసు నమోదైంది. అనంతరం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి తీరును తప్పుపట్టింది. హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని సూచనలు చేసింది.

 

మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం..
ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించి మీడియాకు కల్నల్‌ ఖురేషీ వివరాలను వెల్లడించింది. దీంతో ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్‌ షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖురేషీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఆమెను ‘ఉగ్రవాదుల సోదరి’ అంటూ ఉగ్రవాదులను హతమార్చేందుకు ఖురేషీ పాక్ వెళ్లారని మంత్రి అన్నారు. దీంతో మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంత్రి వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. విద్వేషాన్ని ప్రోత్సహించినందుకు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని జస్టిస్‌ అతుల్‌ శ్రీధరణ్, జస్టిస్‌ అనురాధా శుక్లాలతో కూడిన ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి తమకు నివేదించాలని డీజీపీని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

 

సుప్రీంకోర్టును ఆశ్రయించిన మంత్రి..
హైకోర్టు ఆదేశాలపై మంత్రి విజయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మంత్రి పిటిషన్‌ను రేపు విచారించేందుకు కోర్టు అంగీకరించింది. మంత్రి తీరును తప్పుపట్టింది. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని ప్రశ్నించింది. హైకోర్టులో క్షమాపణలు చెప్పాలని సూచించింది. ఇలాంటి అంశాల్లో సున్నితంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తంచేసింది. జాతీయ మహిళా కమిషన్‌కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించింది. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.

ఇవి కూడా చదవండి: