IndiGo : ఇండిగో కీలక ప్రకటన.. ఈ నెల 10వ తేదీ వరకు 165 విమాన సర్వీసుల రద్దు

IndiGo : జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో భారత గగనతలంలో కొంతమేర కేంద్రం ఆంక్షలు విధించింది. ఇప్పటికే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తాజాగా ప్రముఖ విమానాయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు 165 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
గగనతలంపై ఆంక్షల నేపథ్యంలో అమృత్‌సర్, బికనేర్, చండీగఢ్, ధర్మశాల, గ్వాలియర్, జమ్మూ, బోధ్‌పుర్, కిషన్‌గఢ్, లేహ్, రాజ్‌కోట్, శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాల నుంచి ఈ నెల 10వ తేదీ ఉదయం 5.30గంటలకు వరకు 165 విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్‌డేట్లను చూసుకోవాలని తెలిపింది. ప్రయాణికులు రీ షెడ్యూల్ లేదా టికెట్‌ను క్యాన్సిల్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఎలాంటి అదనపు చార్జీలు లేవని, క్యాన్సిల్ చేసుకుంటే పూర్తి రీఫండ్ కూడా ఇస్తామని వెల్లడించింది.
ఎయిర్ ఇండియా కూడా..
ఎయిర్ ఇండియా సంస్థ విమాన సర్వీసులను రద్ద చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 10వ తేదీ ఉదయం వరకు శ్రీనగర్, జమ్మూ, లేహ్, బోధ్‌పుర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, చండీగఢ్ విమానాశ్రయాలకు తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులకు ఒకే టైమ్ రీషెడ్యూల్ ఛార్జీల మినహాయింపు కల్పించింది. లేక పూర్తి రీఫండ్ ఇస్తామని వెల్లడించింది. స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ తదితర విమానాలు కూడా రద్దయ్యాయి.
18 ఎయిర్ పోర్టులు మూసివేత..
మరోవైపు, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో బుధవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 18 ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేశారు. శ్రీనగర్, లేహ్, అమృత్‌సర్, చండీగఢ్‌తోపాటు పలు విమానాశ్రయాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.