Last Updated:

Karnataka : కర్ణాటకలో నందిని పాల ఉత్పత్తుల పాల ధరలు పెంపు.. లీటర్‌కు ఎంతంటే?

Karnataka : కర్ణాటకలో నందిని పాల ఉత్పత్తుల పాల ధరలు పెంపు.. లీటర్‌కు ఎంతంటే?

Karnataka : కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కారు నందిని పాల ఉత్పత్తుల రేట్లను పెంచింది. లీటరుకు రూ.4 చొప్పున పెంచినట్లు ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయి. పాలతోపాటు పెరుగుపై కూడా అంతే పెంచినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసమే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

 

 

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో ఇవాళ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో పాల ధరలను పెంచే అంశంపై చర్చినట్లు మంత్రి కె. వెంకటేశ్ వెల్లడించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. లీటర్‌ పాలు, కేజీ పెరుగుపై రూ.4 పెంచేందుకు నిర్ణయించామన్నారు. ఏప్రిల్‌ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నాయని తెలిపారు. ఇకపై రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారులకు నూతన రేట్లు నేరుగా ప్రభుత్వం నుంచి అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గతేడాది జూన్‌ 26న అమల్లోకి వచ్చిన లీటరుకు రూ.2 పెంపును ఉపసంహరిస్తున్నామని పేర్కొన్నారు.

 

 

కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్) నందిని బ్రాండ్ పాలు, వాటి ఉత్పత్తులపై రూ.5 పెంచాలని డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం రూ.4 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైతులకు మద్దతు అందించేందుకు కొత్త ధరలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమ వద్ద పాలు చాలా చౌకగా లభిస్తున్నాయని కేఎంఎఫ్‌ పేర్కొంది. మూడేళ్లలో కేఎంఎఫ్‌ పాల ధరలు ఇంత ఎక్కువ మొత్తంలో పెంచడం ఇదే తొలిసారి.

పెంపు తర్వాత ధరలు..

-టోన్డ్‌ పాలు : లీటరుకు రూ.46 (గతంలో రూ. 42)
-హోమోజెనైజ్డ్ టోన్డ్ పాలు : రూ. 47 (గతంలో రూ.43)
-ఆవు పాలు (గ్రీన్‌ ప్యాకెట్‌) : రూ. 50 (గతంలో రూ.46)
-శుభమ్‌ పాలు : రూ. 52 (గతంలో రూ.48)
-పెరుగు : రూ. 54 (గతంలో రూ. 50)

ఇవి కూడా చదవండి: