Published On:

Pahalgam : జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రదాడి, 20కిపైగా మృతులు

Pahalgam : జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రదాడి, 20కిపైగా మృతులు
  • పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు 20కిపైగా మృతులు
  • దాడికి బాధ్యత వహిస్తున్నట్లు రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది
  • దాడిని మెహబూబా ముఫ్తీ ఖండించారు

 

Pahalgam : జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20కిపైగా మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 2:30గంటలకు దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌  బైసరన్ పర్వత శిఖరం వద్ద కాల్పులు జరిగాయి.  ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యం లేదని కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవడానికి వీలుంది. బైసరన్ పచ్చిక బయళ్లలో గుర్రపు స్వారీని ఆస్వాదిస్తున్న పర్యాటకులపై  ముగ్గురు తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

 

చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్ లో సామాన్య ప్రజలపై కాల్పులు జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత సామాన్య ప్రజలు తీవ్రవాదుల చేతుల్లో హతమవడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. ఒక మహిళ తన భర్తను రక్షించమని ఏడుస్తున్న దృష్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించింది.

 

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ దాడిని తీవ్రంగా ఖండించారు. “పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇటువంటి హింస ఆమోదయోగ్యం కాదు” అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.