Published On:

Toll Gates: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. టోల్ గేట్ల వద్ద నో వెయిటింగ్!

Toll Gates: గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. టోల్ గేట్ల వద్ద నో వెయిటింగ్!

NHAI to introduce GPS-based GNSS Toll System: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి క్యూలో ఉండకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే టోల్ పాలసీ విషయంలో మార్పులు తీసుకొస్తూ కొత్త టోల్ పాలసీ ప్రవేశపెట్టనుంది. శాటిలైట్ ఆధారంగా పనిచేసే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే కొత్త టోల్ పాలసీ మరో 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

 

అయితే, గత కొంతకాలంగా దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. సెలవులు, పండుగల సమయాల్లో టోల్ గేట్లు కిక్కిరిసిపోతున్నాయి. వాహనదారులు గంటల కొద్దీ టోల్ గేట్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆప్ ఇండియా కొత్త వ్యవస్థను పరిచయం చేస్తుంది. ఇందులో భాగంగానే శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ పాలసీ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

 

ఈ విధానంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త పాలసీ శాటిలైట్ బేస్డ్ టోల్ కలెక్షన్ సిస్టమ్.. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఫర్పెక్ట్ రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ అందిస్తుంది. అంతేకాకుండా ఈ కొత్త పాలసీ ద్వారా జాతీయ రహదారులతో పాటు ఇతర దారుల్లోనూ 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు.

 

మరో 15 రోజుల్లో ఈ కొత్త పాలసీ అందుబాటులోకి వస్తే టోల్ గేట్లతో అవసరం ఉండదు. జాతీయ రహదారిపైకి వాహనాలు వచ్చిన వెంటనే ప్రయాణించే దూరం ఆధారంగా శాటిలైట్ ట్రాకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి నగదు చెల్లింపులు జరుగనున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ఎంత దూరం ప్రయాణం జరిగితే అంతే నగదు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. ఈ విధానంలో ఎలాంటి ఫిర్యాదులు, ఘర్షణలకు తావు ఉండదని మంత్రి తెలిపారు.

 

ఇదిలా ఉండగా, ఇప్పటివరకు వాహనదారులు టోల్ ఛార్జీ చెల్లించేందుకు ఫాస్టాగ్ స్టిక్కర్ వాహనాలకు ముందు తగిలించుకున్నారు. ఒకవేళ మరో 15 రోజుల్లో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే కొత్త టోల్ పాలసీ అందుబాటులోకి వస్తే.. శాటిలైట్ ట్రాకింగ్ కోసం జీపీఎస్ వంటి కొత్త పరికరాన్ని అమర్చుకోవాల్సి ఉండే అవకాశం ఉంది. కాగా, ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేయలేదు. త్వరలోనే కొత్త పాలసీని ప్రకటించి వాహనదారులకు అడిషనల్ సమయం ఇచ్చే అవకాశం ఉంది.