Ugadi Celebrations : మళ్లీ సీఎంగా కేసీఆర్.. తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు

Ugadi Celebrations : కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌ల స్టేట్ కార్యాలయాల్లో ఇవాళ ఉగాది పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు పంచాంగ శ్రవణంలో ఆసక్తికర విషయాలు వినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించారు. వేడుకలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు.
గాంధీ భవన్‌లో..
గాంధీ భవన్‌లో ఉగాది పండుగ సందర్భంగా పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది విశ్వావసు నామ సంవత్సరం పేరుతో ప్రారంభమైందని ప్రముఖ పండితులు పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు దేశవ్యాప్తంగా గృహనిర్మాణ పథకాలు మంచిగా అమలు జరుగుతాయన్నారు. విదేశీ నిల్వలు పెరుగుతాయని చెప్పారు. పాడి పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్, విద్యుత్ పరిశ్రమలు, పారిశ్రామిక విభాగంలో అనేక మార్పులు చేస్తారని, కొంత వరకు నిరుద్యోగ సమస్య కూడా తీరుస్తారని తెలిపారు. కొన్ని మండలాల్లో అతివృష్టి, కొన్ని మండలాల్లో అనావృష్టి.. వర్షాలు ఆలస్యంగా పడే అవకాశం ఉంటుందని చెప్పారు. తుఫానులు అధికంగా ఉంటాయని తెలిపారు. తీర ప్రాంతంలో ఉన్న వారికి నష్టం ఏర్పడే అవకాశం ఉందన్నారు. సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ఘటనల వల్ల అక్కడ కర్ఫ్యూ విధించే పరిస్థితి వస్తుందన్నారు.
తెలంగాణ భవన్‌లో..
తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది ప్రజాపాలనపై దృష్టి తక్కువగా పెట్టే పరిస్థితి ఉందని ప్రముఖ పండితుడు పంచాంగ శ్రవణం చెప్పారు. ప్రజాపాలనలో లోపం, ప్రభుత్వం నడపడానికి కూడా ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. కేంద్రం నుంచి వచ్చే సహకారం రాష్ట్రం తీసుకోవడం సంపూర్ణంగా ఉండదన్నారు. అధికార దుర్వినియోగం చేసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. వచ్చే ఏ ఎన్నికలైన బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు. కానీ రాజు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడే స్థితి ఉందని చెప్పారు. ఎన్నికలు ఎక్కువగా వాయిదా పడే ఛాన్స్ ఉందన్నారు. శ్రీరాముని జాతకం ఉన్న ఉచ్చస్థితి కేసీఆర్ జాతకంలో ఉందని చెప్పారు. తిరిగి కేసీఆర్ సీఎంగా పట్టం కట్టడానికి అవకాశం ఉన్న సంవత్సరం ఇదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ రాశి ఫలాల్లో రాహువు అష్టమంలో ఉన్నప్పటికీ అమ్మవారు, నరసింహ స్వామి అనుగ్రహం ఉందన్నారు.