Published On:

CM Revanth Reddy : హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది.. ఇది ప్రజలు గుర్తించాలి : సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy : హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది.. ఇది ప్రజలు గుర్తించాలి : సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy inaugurated Hydra Police Station : నగరంలోని బుద్ధ భవన్‌లో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోయి ప్రజలు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయని, ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ర్పచారం చేశారని మండిపడ్డారు. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేది.. ఇది ప్రజలు గుర్తించాలని కోరారు. చిన్న వాన పడితేనే హైదరాబాద్ మొత్తం అల్లకల్లోలం అవుతుందన్నారు. ఇంటి నుంచి కాలు బయటపెట్టే పరిస్థితి ఉండదని చెప్పారు. కాలనీలు చెరువులను తలపిస్తాయని గుర్తుచేశారు. భవిష్యత్‌లో అలాంటి పరిస్థితి ఏర్పడొద్దనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

 

రాష్ట్రంలో భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు అరికట్టేందుకు కాంగ్రెస్ సర్కారు హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని పరిధిని మరింత విస్తరించేలా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్‌లో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 30 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తారు.

 

బీజేపీ చేస్తే ఒప్పు.. తాము చేస్తే తప్పా..?
మూసీని ప్రక్షాళన చేసి నగరవాసులకు మంచి జీవితం ఇవ్వాలని భావించామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం గంగానది, యుమునా నదిని ప్రక్షాళన చేయలేదా? అని ప్రశ్నించారు. నదుల ప్రక్షాళన బీజేపీ చేస్తే ఒప్పు.. తాము చేస్తే తప్పా? అని మండిపడ్డారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి చేస్తే గొప్ప.. తెలంగాణ ప్రజలు చేసుకుంటే తప్పా? అని ప్రశ్నించారు. మూసీలో ఆక్రమణలు తొలగిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందని దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూముల్లో అభివృద్ధి పనులు చేపడితే దాన్ని కూడా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.

 

ఐఎంజీ భారత్ అనే సంస్థ చేతిలో ఉన్న 400 ఎకరాల భూములను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిందన్నారు. 400 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పట్టించుకోలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం కోర్టులో పోరాడి ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందన్నారు. ఈ భూముల్లో కంపెనీలు నిర్మిస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయని భావించామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి కాకుండా, కొత్త ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నారని సీఎం విమర్శించారు.

ఇవి కూడా చదవండి: