Published On:

Film Awards : జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం : భట్టి విక్రమార్క

Film Awards : జూన్ 14న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం : భట్టి విక్రమార్క

Film Awards : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డులకు వేదిక ఖరారు అయింది. ఎఫ్‌డీసీ చైర్మన్‌ దిల్‌రాజు ఏర్పాట్లకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇస్తున్నది. అవార్డుల ఎంపిక కోసం జ్యూరీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జ్యూరీ చైర్మన్‌గా ప్రముఖ నటి జయసుధతోపాటుగా 15 మంది సభ్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్‌రాజు, జయసుధ మీడియాతో మాట్లాడారు.

 

చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తాం : భట్టి విక్రమార్క
తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలుగు చిత్రాలను మాత్రమే కాదు.. ఉర్దూ చిత్రాలను కూడా ప్రోత్సహిస్తామని తెలిపారు. గద్దర్‌ తెలంగాణ చలన చిత్ర అవార్డులపై నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. తెలంగాణ గుండె చప్పుడును తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్‌ అని కొనియాడారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గద్దర్‌ బాణి, పాటలను అనుకరిస్తామన్నారు. గద్దర్‌ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశారని గుర్తుచేశారు. గద్దర్ పేరు మీద అవార్డులు ప్రదానం చేయడం హర్షణీయమన్నారు. హైదరాబాద్‌లో జరిగే చలన చిత్ర అవార్డులు ఘనంగా నిర్వహించాలని కోరారు. అందుకు కావాల్సిన సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని హామీనిచ్చారు.

 

 

హెచ్‌ఐసీసీ వేదిగా కార్యక్రమం : దిల్‌రాజు
ఈ సందర్భంగా ఎఫీడీసీ చైర్మన్ దిల్‌రాజు మాట్లాడారు. జూన్‌ 14వ తేదీన గద్దర్‌ చలన చిత్ర ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవం హెచ్‌ఐసీసీలో ఉంటుందని తెలిపారు. కాగా, సుమారు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డుల పురస్కారాలు ఇస్తున్నది. పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. జ్యూరీ కమిటీకి చైర్మన్‌గా నటి జయసుధను ఎంపిక చేశారు. అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు వచ్చాయి. వ్యక్తిగత కేటగిరీలో 1172 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఫీచర్ చిత్రం, చిల్డ్రన్ చిత్రాలు, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర కేటగిరిల్లో 76 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసిన నామినేషన్లను జ్యూరీ కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు.

 

 

 

 

ఇవి కూడా చదవండి: