KCR On Tribal Reservation: వారం రోజుల్లో.. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లను అమలు చేస్తాం
రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
Hyderabad: రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను వారం రోజుల్లో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో గిరిజనులను, ఆదివాసీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ ఆత్మీయ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి గిరిజనులు, ఆదివాసీలు భారీ ఎత్తున తరలివచ్చారు.
గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయామని, ఇక అడిగి విసిగి పోదల్చుకోలేదని, ఇక వేచి చూడలేం. వారం రోజుల్లో తప్పకుండా జీవో విడుదల చేసేస్తామని ఆయన తెలిపారు. 10శాతం రిజర్వేషన్ను అమలు చేసి గౌరవం కాపాడుకుంటావా? లేదంటే దాన్ని ఉరితాడు చేసుకుంటావా? ఆలోచించుకోవాలి మోదీ అని కేసీఆర్ అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు గిరిజనులు 6 శాతం రిజర్వేషన్లు పొందారని, ఆ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా అడుగుతున్నప్పటికీ ప్రధాని మోదీ దీనిపై స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఆమోదం చేసి పంపిస్తే ఐదు నిమిషాల్లో జీవో విడుదల చేసి, రాష్ట్రంలో బ్రహ్మాండంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి పంపాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: ఆయన కలపడానికి వస్తే, మీరు విడదీయానికి వచ్చారు.. అమిత్ షా పై కేటీఆర్ సెటైర్లు