KTR: కాంగ్రెస్ అరాచక పాలన ఎండగడుతాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

BRS Party Leader KTR Comments KCR Meeting: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్‌లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత 11 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. గులాబీ సైనికులు కేసీఆర్ సందేశాన్ని ప్రతీ గ్రామానికి చేర్చాలని కేటీఆర్ చెప్పారు.
ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలతో కలిసి సభాస్థలిని ఆయన పరిశీలించారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. గులాబీ జెండా లేదా తెలంగాణ భవన్ గుర్తొస్తుందన్నారు. అందుకే బీఆర్ఎస్.. ఓ జనతా గ్యారేజీలా మారుతుందన్నారు. వరంగల్ చాలా మహాసభలకు వేదిక అయిందని, తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సైతం మళ్లీ వేదిక అవుతుందన్నారు. సభకు 40వేల వాహనాలు వచ్చినప్పటికీ పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 100 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారన్నారు.
‘రాష్ట్రంలో మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా బండెనక బండి కట్టి.. తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన అన్నదాతల సంకల్పానికి నా సలాం.. జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో.. సూర్యాపేట రైతులు చూపించిన ఈ చైతన్యం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకం.. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీ రామ రక్ష అని, మీ ఆశయం ఎలుగెత్తి చాటుతోంది. గులాబీ జెండాను గుండెల నిండా నింపిన.. మీరే బీఆర్ఎస్‌కు కొండంత గుండెధైర్యం. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ.. లక్షలాది మంది రైతన్నలే.. రేపు రాష్ట్ర రాజకీయాలను.. మలుపుతిప్పే రథసారథులు..జై కిసాన్..జై తెలంగాణ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.