TG ICET 2025 Application: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఐసెట్ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు

ICET 2025 Application Deadline Extended May 15th: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఐసెట్ దరఖాస్తు గడువును పెంచింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఐసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించడంతో చాలా మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫె సర్ అలువాల రవి ప్రకటన విడుదల చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాగా, ఈ ఎంట్రన్స్ పరీక్షకు ఇప్పటికే 62,642 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరోసారి గడువు పొడిగించడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తిగా చేసుకోవాలని చెబుతున్నారు. ముందే దరఖాస్తు చేసుకుంటే.. ఏవైనా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే చివరి నిమిషం వరకు నిరీక్షణ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
కాగా, అంతకుముందు, నోటిఫికేషన్ ప్రకారం.. ఐసెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 30 వరకు మాత్రమే గడువు ఇవ్వగా.. మే 7 వరకు పొడిగించారు. మళ్లీ రెండోసారి పొడిగించారు. ఇక, రూ.250 ఆలస్య రుసుంతో మే 17వరకు.. అలాగే రూ.500 ఆలస్య రుసంతో మే 27 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఇదిలా ఉండగా, మే 28వ తేదీన ఐసెట్ హాల్ టికెట్లను విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 5, 6వ తేదీల్లో పరీక్ష ఉండగా.. జూన్ 28వ తేదీన ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఒక వేళ ఐసెట్ దరఖాస్తులో ఏమైనా మార్పులు, చేర్పులు చేసేందుకు మే 17 నుంచి 20 వరకు అవకాశం కల్పించారు.