Hyderabad Metro : పాతబస్తీ మెట్రో పనులపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన..

Hyderabad Metro : నగరంలోని పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరిగింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ వేసి పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మెట్రో నిర్మాణం వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని ఫౌండషన్ తన పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏఏజీ వాదనలు వినిపించారు. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాలను నష్టం లేకుండా చూస్తున్నామని ఈ సందర్భంగా ఏఏజీ కోర్టుకు తెలిపారు. చారిత్రక కట్టణాలను కూలగొట్టడం లేదని చెప్పారు. పరిహారం చెల్లించాకే స్థలాలు సేకరించి నిర్మాణాలు చేపడుతామని పేర్కొన్నారు. దీన్నిపై కౌంటర్ దాఖలు చేయడానికి ఏఏజీ సమయం కోరారు.
ఈ మేరకు హైకోర్టు స్పందించింది. మెట్రో నిర్మాణ పనుల్లో భాగంగా పాలబస్తీ చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం చేయకూడదని సూచించింది. పురావస్తుశాఖ గుర్తించిన చారిత్రక కట్టడాల వద్ద ఎలాంటి పనులు కూడా చేపట్టకూడదని ఆదేశించింది. ఈ నెల 22లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ధర్మాసనం పిటిషన్‌పై తదుపరి విచారణను 22కి వాయిదా వేసింది.