AP Cabinet : ముగిసిన ఏపీ కేబినెట్.. 23 అంశాలపై చర్చ

AP Cabinet : ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను డీమెర్జ్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఏపీడీసీ (ఏపీ డ్రోన్ కార్పొరేషన్)ను ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్) నుంచి సపరేట్ చేసి, స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో డ్రోన్ సంబంధిత అంశాలను నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. నేడు వెలగపూడిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. భేటీలో 23 అంశాలపై చర్చించారు. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, అమరావతితోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, అమరావతి పునర్‌నిర్మాణ పనులు, ప్రధాని మోదీ పర్యటనపై చర్చ సాగింది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐపీఎస్ అధికారులు గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ‘స్వర్ణ గ్రామం’ పేరుతో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఉన్నతాధికారులు మూడు రోజులు, రెండు రాత్రులు నిద్ర చేయాలన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని సూచించారు. మంత్రులు రుషికొండ ప్యాలెస్‌ను సందర్శించాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సీఎం స్పందించారు. ప్రవీణ్ కేసును ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయన్నారు. అన్ని కేసుల్లో సీసీ కెమెరాల ద్వానే కీలక సాక్షాలు లభిస్తాయని తెలిపారు.
మంత్రివర్గం ఆమోదించిన అంశాలు..
-అనకాపల్లి జిల్లాలోని డీఎలపురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
-త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోద ముద్ర
-బార్ లైసెన్స్‌ల ఫీజును రూ.25 లక్షలకు కుదింపు
-యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్‌కు రైట్
-రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ
-ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025కి ఆమోదం.
-నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం.
-జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం.
-జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన.