Tirupati Road Accident : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి

Tirupati Road Accident : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప‌్ప రెడ్డి పల్లి ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులు తమిళనాడుకు చెందిన వారే..
తమిళనాడుకు చెందిన ఏడుగురు భక్తులు కారులో తిరుమలకు బయలుదేరారు. పాకాల వద్ద కారు ఓవర్‌టెక్ చేయబోయి అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. కంటైనర్ కిందకు కారు దూసుకెళ్లింది. దీంతో తమిళనాడుకు చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓ వృద్ధుడు, చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఉన్నవారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కారు పూర్తిగా కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో బయటకు తీశారు. కానీ, అప్పటికే కారులో ఉన్న ఏడుగురు మృతిచెందారని ధ్రువీకరించారు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : సీఎం చంద్రబాబు
తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్‌ను కారు ఢీకొన్న ఘటనలో కారులోనే వారు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. వారికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆదుకోవాలని అధికారులకు సూచించారు.