AP New DGP : ఏపీకి కొత్త డీజీపీ.. కేంద్రానికి ఐదుగురి పేర్లు

AP New DGP : ఏపీ ప్రభుత్వం కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్రనాథ్‌రెడ్డి, హరీశ్‌కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లను కేంద్రానికి పంపించింది. ఇందులో మూడు పేర్లు ఎంపిక చేసి ఏపీ ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ప్రస్తుతం ఏపీ ఇన్‌చార్జి డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా కొనసాగుతున్నారు. డీజీపీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇన్‌చార్జిల నుంచి పూర్తిస్థాయి డీజీపీ నియామాకానికి మొగ్గు చూపిన కూటమి ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో మెరిట్ ఆధారంగా హరీశ్ కుమార్ గుప్తా పేరు ఉంటుందని, మరో రెండేళ్లపాటు ఆయనకు డీజీపీ అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది.