PAK Attack: మరోసారి పాక్ దాడులు.. ధీటుగా ఎదుర్కొంటున్న భారత్

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ పోర్ట్, ఆర్మీ పోస్ట్ లు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. డ్రోన్స్, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కాగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కోంది.
మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. అందుకు భారత ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. కాగా నిన్న పాకిస్తాన్ ప్రయోగించిన దాదాపు 400 మిస్సైళ్లను భారత్ కూల్చివేసిందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అలాగే పాకిస్తాన్ దాడులకు ప్రతిగా పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో భారత్ డ్రోన్లతో దాడులు చేసింది.
అయితే ఇంకా బుద్ధి మారని పాకిస్తాన్ ఇవాళ కూడా దాడులకు పాల్పడుతోంది. రాత్రి కాగానే భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడుతోంది. తాజాగా జమ్మూ, సాంబా, పఠాన్ కోట్ సెక్టార్లలో డ్రోన్లతో దాడికి యత్నిస్తోంది. యురి సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులు జరుపుతున్నట్టు సమాచారం. కాల్పులు, భారీ పేలుళ్లతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. సరిహద్దుల వెంబడి సైరన్లు మోగాయి. కాగా పాక్ చేస్తున్న దాడులను భారత్ ధీటుగా తిప్పికొడుతున్నాయి.
కాగా జమ్మూ, అక్నూర్, జైసల్మేర్, అంబాలా, పంచుకులలో కరెంట్ సరఫరా నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ అమలు చేస్తున్నారు. దాడులపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు జమ్మూలో బ్లాక్ అవుట్. నగరం అంతటా సైరన్ లు వినబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. జమ్మూతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి, దయచేసి విధుల్లోకి ఎవరూ రావొద్దు. ఇంట్లో లేదా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోండి. పుకార్లను నమ్మకండి. అలాగే వదంతులను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.