Prime Minister Narendra Modi : ప్రధాని మోదీ అమరావతి పర్యాటన ఖరారు.. ఎప్పుడంటే?

Prime Minister Narendra Modi : రాజధాని అమరావతి నిర్మాణాల పున:ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖారారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పనులను మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచి పనుల పున:ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. మోదీ ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా కూటమి సర్కారు నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది.
ఏర్పాట్లు ముమ్మరం..
మరోవైపు కార్యక్రమానికి 5లక్షల మంది హాజరు అవుతారనే అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.