Australia: ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీ విక్టరీ.. ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్

Elections: ఆస్ట్రేలియాలో ఇవాళ జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో ఆంథోనీ అల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో దేశ ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్ రెండోసారి అధికారం చెపట్టబోతున్నారు. 2004 తర్వాత వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలి ప్రధానిగా ఆంథోనీ రికార్డ్ సృష్టించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
కాగా ఆ దేశ పార్లమెంట్ లోని 150 స్థానాలకు ఇవాళ ఎలక్షన్స్ జరిగాయి. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు జరగగా.. అధికార లేబర్ పార్టీ ఇప్పటికే 86 స్థానాలను కైవసం చేసుకుంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీకి 39 సీట్లు వచ్చినట్టు స్థానిక మీడియా ఛానళ్లు ప్రకటించాయి. కాగా 2022 నుంచి ప్రధానిగా కొనసాగుతున్న ఆంథోనీ మరో మూడేళ్లు పదవిలో కొనసాగనున్నారు.
మరోవైపు రెండోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైనా ఆంథోనీ అల్బనీస్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రధానిగా మరోసారి ఎన్నికైనందుకు అభినందనలు. ఎన్నికల ఫలితాలతో మీ నాయకత్వంపై ఆస్ట్రేలియా ప్రజల విశ్వాసాన్ని సూచిస్తోంది. భారత్- ఆస్ట్రేలియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు, ఇండో- పసిఫిక్ లో శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను” అని ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.