Published On:

AP Cabinet: ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి..!

AP Cabinet: ఎస్సీ వర్గీకరణకు క్యాబినెట్ ఆమోదం.. రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి..!

AP Cabinet Approves SC Sub-Categorization Ordinance: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్‌కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. ఎస్సీ ఉపవర్గీకరణలో 200 పాయింట్ల రోస్టర్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

 

వర్గీకరణలో భాగంగా గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు సమానంగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

 

అన్ని షెడ్యూల్ ఉపకులాలకు విద్య, ఉద్యోగాల్లో సమానమైన, న్యాయమైన ప్రవేశాల అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఏకసభ్య కమిషన్ నివేదికతో పాటు సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రిజర్వేషన్లకు 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

 

రాష్ట్రంలో మతకలహాలు కలిగేలా కొంతమంది కుట్రలు చేస్తున్నారని హోం మంత్రి అనిత ఆరోపించారు. ప్రధానంగా శాంతి భద్రతలకు భంగం వాటిల్లేందుకు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, టీటీడీపై కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై చెడ్డపేరు రావాలనే ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంపై కుట్రలు చేశారని, సీసీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చేసరికి ఏం మాట్లాడడం లేదన్నారు.

 

ఇదిలా ఉండగా, ఏపీ కేబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.789 కోట్లతో హైకోర్టు భవనం నిర్మాణ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే వీటిని ఎల్ 1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. అంతేకాకుండా స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటుతో పాటు పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణ ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.