Godavari River Management Board: ఏపీ సర్కారు సమాచారం, వివరాలు దాచి పెడుతోంది.. గోదావరి నదీ యాజమాన్య బోర్డులో కీలక చర్చలు

Godavari River Management Board: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్ ఏకే ప్రధాన్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని జలసౌధలో సోమవారం జీఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. ఏపీ సర్కారు తలపెట్టిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు గురించి తెలంగాణ ప్రస్తావించింది. ఏపీ సర్కారు సమాచారం, వివరాలు దాచిపెడుతోందని తెలంగాణ అధికారులు ఈ సందర్భంగా ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి ఐదు నెలలు గడిచాయని, కేంద్రం నుంచి లేఖలు వచ్చినా తమకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టు పూర్తి వివరాలు, దానివల్ల తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం తదితర వివరాలు ఏపీ సర్కారు అందించాలని తెలంగాణ అధికారులు బోర్డును కోరారు.
అనుమతులు లేకుండానే..
ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఏపీ అధికారులు స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టుకు ఇంకా డీపీఆర్ తయారు చేయలేదని వివరణ ఇచ్చారు. మరోవైపు పెదవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై కూడా భేటీలో చర్చించారు. రూ.15కోట్లతో వెంటనే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీఆర్‌ఎంబీ కార్యదర్శి అజగేషన్ వ్యవహార శైలిని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాలు ఎలా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. జీఆర్‌ఎంబీలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఏపీ, తెలంగాణకు చెందిన అధికారులను అజగేషన్ వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. మహిళా ఉద్యోగులను అసభ్యకర మాటలతో దూషిస్తున్నారని వివరించారు. సమావేశంలో తెలంగాణ నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్, ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు తదితర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.