SIT Issued Notice to Vijayasai Reddy: మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి బిగ్ షాక్.. మద్యం కుంభకోణంలో సిట్ నోటీసులు!

SIT notices issued to former YSRCP leader Vijayasai Reddy: గత వైసీపీ సర్కారు హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో కేసు సంచలనంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం కుంభకోణంపై విచారించేందుకు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 18న విచారణకు హాజరు కావాలి..
ఈ నెల 18వ తేదీన విజయవాడలోని సీపీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. విజయసాయిరెడ్డి వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడు కసిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌తోపాటు పలు ప్రాంతాల్లో 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీలు చేశాయి. కేసులో కసిరెడ్డికి కూడా నోటీసులు అందించారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో అవకతవకలు..
2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ మద్యం విధానంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మద్యం లైసెన్స్‌ల కేటాయింపులో అవకతవకలు, నకిలీ, నాసిరకం మద్యం ఉత్పత్తి, అమ్మకాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బినామీ డిస్టిలరీల నుంచి సబ్-స్టాండర్డ్ మద్యం కొనుగోలు చేశారు. దీంతో రూ. 20వేల కోట్లకు పైగా ఆర్థిక నష్టంతోపాటు రూ. 4వేల కోట్ల వరకు కిక్‌బ్యాక్‌లు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆల్కహాల్ వ్యసనం వల్ల ఆత్మహత్యలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా సూచిస్తోంది.