Manish Sisodia Arrest: మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. ఇదే కేసులో సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడంతో ఇప్పటికే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
Manish Sisodia Arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. ఇదే కేసులో సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడంతో ఇప్పటికే ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.
మంగళవారం నాడు తీహార్ జైలులో మనీష్ సిసోడియాను ఇడి అధికారులు 45 నిమిషాల పాటు ప్రశ్నించారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. తీహార్ జైలులో ఉదయం 10.15 గంటల నుంచి 11 గంటల వరకు విచారించారు.మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్పై శుక్రవారం ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.అతను ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
మనీశ్ సిసోడియా భద్రతపై ఆప్ ఆందోళన..(Manish Sisodia Arrest)
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా భద్రతపై ఆమ్ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించింది. సిసోదియాకు జైల్లో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని బీజేపీ నేత మనోజ్ తివారీ కూడా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించిన ఎన్నో రహస్యాలు సిసోడియాకు తెలుసు. తన సన్నిహితుడికి తన ప్రభుత్వం ఆధీనంలోని జైలులో ప్రాణహాని ఎలా ఉంటుందని తివారి ప్రశ్నించారు. సిసోడియా నుంచి ఎటువంటి రహస్యాలు బయటకు రాకుండా ఆయన్ను చంపేందుకు కేజ్రీవాల్ ఏమైనా కుట్రపన్నుతున్నారా అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ నుంచే ప్రాణహాని ఉందని ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. సిసోడియాకు సాధ్యమైనంత వరకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని జైలు అధికారులను తాను అభ్యర్థిస్తున్నాను అని వ్యాఖ్యానించారు తివారీ.
ఆప్ నేతల ఆరోపణలు అవాస్తవం..
సిసోడియా రక్షణపై ఇదివరకు ఆప్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. ఆయనపై మోపిన తప్పుడు అభియోగాలపై సంతకం పెట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ప్రమాదకరమైన నేర చరిత్ర కలిగిన ఖైదీలున్న జైలు నంబర్ 1 లో మనీశ్ సిసోడియాను ఉంచారు. దీంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది అని ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి నేరస్థులతో సిసోడియాను ఉంచారని ఆ పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ఆరోపించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన జైలు అధికారులు.. సిసోడియా భద్రతను దృష్టిలో ఉంచుకొని జైలు నంబర్ 1లో ఉంచామన్నారు. అక్కడ ఆయన ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చునని జైలు అధికారులు అన్నారు.