Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం

Six Killed Road accident in ferozpur: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నుహ్ జిల్లాలోని ఫిరోజ్‌పూర్ ఝిర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్రహీంబాస్ గ్రామ సమీపంలో ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం 11 మంది పారిశుద్ధ్య కార్మికులు జాతీయ రహదారిని శుభ్రం చేస్తుండగా.. వేగంగా వచ్చిన ట్రక్కు వీరిని బలంగా ఢీకొట్టింది. ఇందులో ఆరుగురు మృతి చెందగా.. ఐదుమందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులంతా ఖూరి ఖలాన్ ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ఇందులో ఒకరు జిమ్రావత్ గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నట్లు ఫిరోజ్‌పూర్ ఝిర్కా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ అమన్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.