Cheetahs: దక్షిణాఫ్రికా నుండి రానున్న మరో 12 చిరుతలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Cheetahs: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చిరుతలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎనిమిది చిరుతలను కునో నేషనల్ పార్కులో ఉంచారు. గతఏడాది సెప్టెంబర్ 17న తన 70వ పుట్టిన రోజు సందర్భంగా ఐదు ఆడ, మూడు మగ చిరుత పులులను ప్రధాని నరేంద్ర మోదీ పార్కులో ఎన్‌క్లోజర్‌లోకి విడిచిపెట్టిన విషయం తెలిసిందే.
జనవరి చివరినాటికి దక్షిణాఫ్రికా నుంచి ఈ చిరుతలు కునో నేషనల్ పార్కు కు చేరుకుంటాయని సమాచారం. ఇందుకోసం పార్కులో ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లను సైతం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాఫ్రికా అధికారులతో చర్చలు తుదిదశకు వచ్చాయని, అన్నీ అనుకున్నట్లు కుదిరితే జనవరి నెలలోనే 12 చిరుతలు కునో పార్కుకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. భారత్‌కు రావాల్సిన చిరుతలన్నీ గత ఆర్నెళ్లుగా దక్షిణాఫ్రికాలో క్వారంటైన్‌లో ఉన్నాయి.జూలై 15 నుండి, తొమ్మిది చిరుతలను లింపోపో ప్రావిన్స్‌లోని రూయిబెర్గ్ క్వారంటైన్ బోమాలో ఉంచారు మరియు మూడు క్వాజులు-నాటల్ ప్రావిన్స్‌లోని ఫిండా క్వారంటైన్ బోమాలో ఉంచారు. అప్పటినుంచి ఒక్కసారి కూడా వేటాడకపోవడంతో చిరుతలు తమ ఫిట్‌నెస్‌ను కోల్పోయినట్లు నిపుణులు చెబుతున్నారు. పరుగు జంతువు కండరాలను టోన్ చేసి ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుందని, అవి కూడా నిశ్చలంగా ఉండే మనుషుల మాదిరిగానే బరువు పెరిగి ఉండవచ్చని అన్నారు
ఎంఓయూపై సంతకం చేయడంలో జాప్యం గురించి ప్రశ్నించగా, చిరుత మార్పిడిపై భారత ప్రతిపాదనను దక్షిణాఫ్రికా పర్యావరణ, అటవీ, మత్స్యశాఖ మంత్రి బార్బరా క్రీసీ గత వారం ఆమోదించారని తెలిపారు.ఎంఓయు ఇంకా సంతకం చేయనప్పటికీ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోంది. కునో నేషనల్ పార్క్ లో వసతి కల్పించడం పట్ల ప్రతినిధి బృందం సంతోషంగా ఉంది. న్యూఢిల్లీ మరియు ప్రిటోరియా మధ్య ఈ నెలలో ఎంఒయుపై సంతకాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.