Jogi Ramesh: చంద్రబాబుకి 2022 బూతులనామ సంవత్సరం- మంత్రి జోగి రమేష్ కామెంట్స్
2022 వైసీపి ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. 2022 చంద్రబాబుకు బూతుల నామ సంవత్సరంగా మారిందంటూ ఎద్దేవా చేశారు.
Jogi Ramesh: 2022 వైసీపి ప్రభుత్వానికి విజయ నామ సంవత్సరం అని ఏపీ గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆనందం నింపిన సంవత్సరమని, ఏ ఎన్నిక జరిగినా వైసీపీ విజయ పరంపరతో గెలిచిన సంవత్సరం ఆయన తెలిపారు. జగన్ నాయకత్వంలో 2022 వైసీపీకి విజయ నామ సంవత్సరం అంటూనే ఇదే 2022 చంద్రబాబుకు బూతుల నామ సంవత్సరంగా మారిందంటూ ఎద్దేవా చేశారు.
ఈ ఏడాదిలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆఖరికి చంద్రబాబు అడ్డా టీడీపీ కంచుకోట అయిన కుప్పం మున్సిపాలిటీతో సహా టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంవత్సరం ఇదే అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు నుంచి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వరకు వారందరికి 2022 బూతుల సంవత్సరం అయిందంటూ సెటైర్లు వేశారు.
మళ్ళీ మా బీసీలంతా ఇస్త్రీ చేసుకుంటూ, మగ్గాలు నేయాలని చెప్తారా ? జగనేమో మా బీసీలంతా ఉన్నత చదువులతో ఉద్యోగ, వ్యాపారాలతో ఎదగాలని కోరుకుంటుంటే చంద్రబాబు మాత్రం బీసీలను మళ్ళీ చేపలు పట్టుకోవాలని, ఇస్త్రీ చేసుకోవాలని చెప్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు ఆలోచనలు చేసే నీకు మళ్ళీ ఎందుకు అధికారం ఇవ్వాలంటూ జోగిరమేష్ ప్రశ్నించారు. కందుకూరులో ఎనిమిది మందిని పొట్టన పెట్టుకున్నారంటూ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. అధికారం కోసం ఇంతగా దిగజారాలా? 24 గంటలు కూడా కాకముందే మళ్ళీ బహిరంగ సభలు పెడుతున్నారు. అభం శుభం తెలియని వారు చనిపోతే త్యాగం చేశారని చెప్పటానికి సిగ్గులేదా? నీ పదవుల కోసం పేదోళ్లు బలి కావాలా? అంటూ చంద్రాబాబుపై జోగిరమేష్ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నడ్డి విరిచేస్తాం అంటూ అన్నారు.
లోకేష్ పాదయాత్ర అంటే ఫ్యాషన్ షో అనుకుంటున్నాడు.. అదేమైనా ఫిజికల్ ఎక్సర్ సైజా? పొలిటికల్ ఎక్సర్ సైజా?.. వార్డు సభ్యునిగా కూడా గెలవలేని లోకేష్.. జగన్ ని విమర్శించడమేంటి? అని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్రకు యువగళం సూట్ అవదని.. ఏ పప్పుగళం, తుప్పుగళం, చిప్పగళం అనో పేరుకుంటే మంచిదంటూ సెటైర్లు వేశారు.
కందుకూరు ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. అమాయకుల ప్రాణాలు పోవటానికి కారణమైన చంద్రబాబుని అరెస్టు చేయాలన్నారు. చంద్రబాబు చేసిన సవాల్ స్వీకరించటానికి తాను సిద్దమని, చంద్రబాబుతో సహా ఎవరు వచ్చినా జనం మధ్య, మీడియా సమక్షంలో చర్చకు రెడీ కావాలని, టైం, డేట్, ప్లేస్ వాళ్లే చెప్పాలని జోగి రమేష్ సవాల్ విసిరారు.