Posani Krishna Murali : పోసానికి బెయిల్.. మంజూరు చేసిన నరసరావుపేట కోర్టు

Posani Krishna Murali : ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళికి నరసరావుపేటలో నమోదైన కేసులో బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నరసారావుపేటలో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరైంది.
మార్చి మొదటి వారంలో కృష్ణమురళిపై కేసు నమోదు కాగా, కేసులో పోలీసులు పిటి వారెంట్‌పై నరసరావుపేట కోర్టులో ఆయన్ను హాజరు పర్చారు. విచారణ చేపట్టిన కోర్టు పోసానికి పది రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో అతడిని నరసరావుపేట టూటౌన్ పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు. తాజాగా నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయినప్పటికీ కోర్టు పోసాని తరఫున న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో పోసాని ఫిబ్రవరి 26న అతడు అరెస్టు అయ్యారు.
పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లోని తన నివాసంలో అరెస్టు చేశారు. మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తరలించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోని పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద అతడిని తీసుకెళ్లారు. కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. ఆదోని కేసులో భాగంగా పోలీసులు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేయగా, నరసారావుపేట కేసులో బెయిల్ మంజూరైంది. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది.