Jagan Assets Issues : వైఎస్ కుటుంబ ఆస్తి వివాదం.. జగన్ పిటిషన్‌పై విచారణ

Jagan Assets Issues: వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల షేర్లను అక్రమంగా బదిలీ చేసుకున్నారని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ ఆశ్రయించారు. కాగా, గురువారం కేసుపై ఎన్సీఎల్టీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల షేర్లు అక్రమంగా బదిలీ చేసుకున్నారని వైఎస్ జగన్ పిటిషన్‌లో తెలిపారు. షేర్ల బదిలీ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని అతడు కోరారు.
విజయలక్ష్మి, షర్మిల, సండూర్ పవర్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌ని ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. మరోవైపు జగన్‌తోపాటు షర్మిల, ఇతర ప్రతివాదులు ఎన్సీఎల్టీలో మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి వాది ప్రతివాదులు సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను ఏప్రిల్ 3కు ఎన్సీఎల్టీ వాయిదా వేసింది.
సరస్వతీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలను వైఎస్ జగన్ అనవసరంగా లాగుతున్నారని ఇటీవల విజయలక్ష్మి పేర్కొన్నారు. జగన్, తన భార్య భారతి ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని తల్లి విజయలక్ష్మి నివేదించారు. సరస్వతీ వాటాలపై సర్వహక్కులు తనవేనని విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆస్తి వివాదాలతో తనను కోర్టులో నిలబెట్టారని, పిల్లల మధ్య వివాదంతో ఏ తల్లీ కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఇంత ఆవేదనకు గురిచేయడం జగన్, భారతికి ఏ మాత్రం సరికాదన్నారు.