Pawan Kalyan : మహిళల రక్షణ బాధ్యత మాదే.. పవన్ కల్యాణ్ హామీ

Pawan Kalyan : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సమాజ నిర్మాణానికి నిజమైన వాస్తు శిల్పి స్త్రీమూర్తి అన్నారు. తన కుటుంబాన్ని చక్కదిద్దడం నుంచి ప్రతి విభాగంలో అతివలు తమ బాధ్యతను విజయవంతంగా పోషిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన ప్రతి స్త్రీమూర్తికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. వారికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి 11.5 లక్షల మందికి రూ.4 వేల కోట్ల ప్రయోజనాలు కలిగించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం చేపట్టిన ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకాల ద్వారా మహిళలు అధిక శాతం లబ్ధి పొందారన్నారు. స్త్రీ సంక్షేమానికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్న మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల వల్ల మహిళలకు ఆర్థికపరమైన అంశాలపై అవగాహన మెరుగుపడుతోందని చెప్పారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే ప్రతి కుటుంబం, తద్వారా సమాజం సంపన్నం అవుతుందన్నారు. ఈ క్రమంలో మహిళల రక్షణ బాధ్యతలు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్య అంశంగా తీసుకుంటుందని చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ రూపాల్లో మహిళల గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడే ప్రతి ఒక్కరిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మహిళల రక్షణ, సంక్షేమమే తమ ప్రభుత్వ బాధ్యత అని పవన్ పేర్కొన్నారు.
తెలుగింటి ఆడపడుచులకు శుభాకాంక్షలు : సీఎం చంద్రబాబు
మహిళా దినోత్సవం జరుపుకోవడం అనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసం పనిచేస్తోందన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలు సాధించిందన్నారు.
స్త్రీమూర్తుల శక్తి అపారం : మంత్రి నారా లోకేశ్
సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ మంత్రి నారా లోకేశ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తి అపారం అన్నారు. సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారని ట్వీట్ చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్నివిధాల అండగా నిలుస్తున్నామన్నారు. మహిళా సంక్షేమం, భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మహిళ సామాజిక, ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తమ తమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలు సాధిస్తూ, అందరికీ స్ఫూర్తిగా నిలువాలని ఆకాంక్షించారు.