Last Updated:

AP CM Chandrababu : రంగన్న మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమే : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : రంగన్న మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమే : సీఎం చంద్రబాబు

AP CM Chandrababu : వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో ప్రత్యేక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న మ‌ృతి అనుమానాస్పదంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేబినెట్ భేటీ అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్‌ మృతిపై చర్చించారు. వివేకానందారెడ్డి హత్యకేసు సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్న అంశంపై గంటపాటు చర్చ జరిగింది. రంగన్నను పోలీసులు చంపారని ముందు వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఎలాంటి దురుద్దేశం లేకపోతే వాచ్‌మెన్ మృతిని పోలీసులకు ఎందుకు ఆపాదిస్తారని, రంగన్న మృతిని ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం జరుగుతోందని కొందరు మంత్రులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. వివేకానందారెడ్డి కేసులో మరో సాక్షి దస్తగిరికి వచ్చిన బెదిరింపులపై కూడా చర్చించారు. రంగన్న మృతి వెనుక ఉన్న అనుమానాలను ఏపీ డీజీపీ మంత్రులకు వివరించారు. అనుమానాస్పద మృతి అని పోలీసుల విచారణలోనూ నిర్ధరణ అయిందని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. వైఎస్ జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ వస్తున్నానని గుర్తుచేశారు. పరిటాల రవి హత్యకేసులో సాక్షులు ఈ విధంగా చనిపోతూ వచ్చారని పేర్కొన్నారు. అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు.

జగన్‌ అరాచకాలను తిప్పికొట్టాలి..
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య ఘటన నుంచి పరిణామాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాజకీయ ముసుగులో కరడుగట్టిన నేరస్తులు ఏపీలో ఉన్నారన్నారు. రాజకీయాలను నేరమయం చేసే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సొంత లబ్ధి కోసమే రాజకీయాలను వైఎస్ జగన్‌ నేరపూరితంగా మార్చేశారన్నారు. ప్రజల దృష్టిని మళ్లీంచేందుకే జగన్‌ చేస్తున్న అరాచకాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వివేకా హత్యకేసు విషయంలో మాజీ సీఎం జగన్‌ ఎలా వ్యవహరించారో ఉదాహరణలతో సహా ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గుండెపోటు అని, గొడ్డలి వేటని, తర్వాత తనపై ఆరోపణలు చేశారని, ప్రతిపక్షంలో ఉంటే సీబీఐ దర్యాప్తు కోరారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దన్నారన్నారు. బాధితురాలు చెల్లినే నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం మంత్రులకు సూచించారు.

కేసు సీబీఐ పరిధిలో ఉన్నా సాక్షులను రక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సాక్షుల అనుమానాస్పద మృతి దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వివేకానందారెడ్డి హత్య జరిగిన రోజు జగన్, భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకొచ్చిన డ్రైవర్ కూడా మృతిచెందిన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. సుదూర ప్రయాణంలో జగన్‌, భారతి వివేకా హత్యపై మాట్లాడుకోవడాన్ని డ్రైవర్ విన్నందుకు తర్వాత అనుమానాస్పద మృతి చెందారని చర్చ జరిగింది. ఇలా ఇప్పటి వరకు 6మంది మృతిచెందిన ప్రస్తావనకు వచ్చింది.

ఇవి కూడా చదవండి: